17, డిసెంబర్ 2017, ఆదివారం

King Dhuryodhana Temple, Malanada, Kerala

                  రారాజు దుర్యోధన ఆలయం, మలనాడ




ప్రత్యేక ఆలయాల రాష్ట్రం కేరళ. ఈ రాష్ట్రం లో కనపడేన్ని విశేష పౌరాణిక నేపధ్యం ఉన్న ఆలయాలు మరెక్కడా కనపడవు.
అలాంటి ఆలయాలలో కూడా మరింత అరుదైన రెండు ఆలయాలు కేరళ రాష్ట్రం కొల్లం(క్విలన్) జిల్లాలో ఉన్నాయి. అవే రారాజు దుర్యోధన మరియు అతని మేనమామ మయా జూదరి శకుని కొలువైన మలనాడ ఆలయాలు.
తన అహంకారం, దాయాదుల పట్ల అకారణ ద్వేషభావంకి తోడు దుష్టపన్నాగాలతో సహకరించే  మామ ఉండటంతో పాండవులను పాచికల ఆటలో ఓడించి, అడవులకు పంపాడు దుర్యోధనుడు. పన్నెండేళ్ల అరణ్యవాసం తరువాత ముఖ్యమైనదైన ఒక సంవత్సర అజ్ఞాతవాసం చేస్తున్న కుంతీ కుమారులను ఎలాగైనా పట్టుకోవాలన్న తలంపుతో మిత్రుడు కర్ణుని, మేమమామ శకునిని సలహా అడిగాడట సుయోధనుడు.  













కుతంత్రాలలోనే కాదు మంత్రవిద్యలలో కూడా ప్రావీణ్యం గల శకుని, నాడు మలైనాడుగా పిలవబడే నేటి కేరళ ప్రాంతం మంత్రతంత్రాలలో నిష్ణాతులైన మంత్రగాళ్ళుకు నిలయమని, వారు తమ మంత్రాలతో పాండవుల మారువేషాలను బట్టబయలు చేయడంలో సహాయపడగలరని చెప్పాడట. అతని మాటల మీద తినలేని భరోసా కలిగిన కురురాజు మామ, సోదరులు, అనుంగు మిత్రుడు రాధేయునితో కలిసి ఈ ప్రాంతానికి వచ్చాడట.
సుదూర ప్రయాణం చేసి విచ్చేసిన రారాజుకు స్థానిక కురువ జాతి వారు ఘన స్వగతం పలికి, దాహం మరియు బడలిక తీరడానికి కొబ్బరి కల్లు పానీయం అందించారట. నాడు వారు అంటరాని వారు. అయినా ఎలాంటి సంకోచము లేకుండా వారి ఆతిధ్యాన్ని స్వీకరించిన గాంధారీ సుతుడు, వారు తన పట్ల చూపిన గౌరవాభిమానాలకు సంతసించి కురువ కుల పెద్దను ఆ ప్రాంతానికి రాజును చేసి, ఎన్నో వేల ఎకరాల భూమిని వారికి కానుకగా ఇచ్చారట.
నేటికీ ఆ భూములు దుర్యోధనుని పేరిట ఉన్నాయని, శిస్తు ఆయన పేరునే చెల్లిస్తారని అంటారు. నాటి నుండి కురువ జాతి వారు ఆయనను భగవంతునిగా ఆరాధించసాగారు.
అక్కడి మంత్రవాదుల, సిద్ధుల సలహా మేరకు కౌరవాగ్రజుడు కొంత కాలం ఇక్కడ ఈశ్వరాధనలో గడిపాడట. ఇక్కడి నుండి తిరిగి వెళ్లిన రారాజు అనంతరం జరిగిన కురుక్షేత్ర సమరంలో వీరమరణం పొందాడు.
ఆయన మరణ వార్త తెలిసిన కురువ రాజు, ఆయన తపస్సు చేసిన ప్రదేశంలో ఒకగద్దె నిర్మించి,  తమ చక్రవర్తికి నివాళులు అర్పించారట. నాటి నుండి నేటి వరకు అక్కడ నిత్య పూజలు కురువ వంశం వారి ఆధ్వర్యంలో జరుగుతున్నాయి.
ఈ ప్రాంతం పేరు మలనాడ. మల అంటే చిన్న కొండ లేదా ఎత్తైన ప్రదేశం. నాడ అంటే ఆలయం లేదా పవిత్ర స్థలం.
నాటి నుండి నేటి వరకు కొల్లం జిల్లాలో కొండ ప్రాంతంలో నెలకొల్పబడిన నూటికి పైగా ఆలయాలకు దుర్యోధనుడే అధిపతి. స్థానికులు ప్రేమగా "అప్పూపన్"(తాత) అని పిలుచుకొంటారు.






రారాజు దుర్యోధన గద్దె 








ప్రతినాయకునికి పూజలు జరగడం ఒక పెద్ద విశేషం కాగా, మరెన్నో ప్రత్యేకతలు, విశేషాలు నెలకొని ఉన్నాయి "పోరువలి పెరువిరుతి మలనాడ క్షేత్రం"లో !
గత కొన్ని సంవత్సరాలలో అభివృద్ధి చెందుతున్నట్లుగా తెలుస్తుంది ఆలయ ప్రధాన ద్వారాన్ని చూస్తే !!
లోపలి ప్రవేశిస్తే ఎలాంటి విగ్రహము, మూలవిరాట్టు దర్శనమివ్వరు. నల్ల రాతితో చెక్కిన గద్దెకి చక్కని పూలతో అలంకరణ చేస్తారు. అంతే ! దానికే అన్ని పూజలు. పైకప్పు ఉండదు. చుట్టూ ఒక వరండా లాంటి నిర్మాణం ఉంటుంది. వీటిల్లోనే ఆలయ కార్యాలయము, వసతి, వంటశాల లాంటివి ఉంటాయి. గద్దె చుట్టూ లెక్కలేనన్ని గొడుగులు కనపడతాయి. అవన్నీ భక్తులు తమ కోర్కెలు తీరిన తరువాత దుర్యోధన మహారాజుకు చెల్లించుకొన్న మొక్కులో భాగమే!
అంతే కాదు ప్రాంగణమంతా ఎలాంటి హద్దు లేకుండా కోడి పుంజులు తిరుగుతుంటాయి. ఇవి కూడా భక్తులు అప్పూపన్ కి సమర్పించుకొన్నవే ! పైకప్పు, ఎలాంటి కాపలా లేని ఆలయానికి ఇవే కాపలాదారులు.
అవ్వడానికి ఒక ప్రతి నాయకుని ఆలయం అయినా  నిత్యం నాలుగు పూజలు జరుపుతారు. అడవి, ముహూర్తి, పుళుక్కు అవుల్ లాంటి ఉత్సవాలను నెలకొకసారి మలనాడ క్షేత్రంలో నిర్వహిస్తారు. నలభై ఏడు ఆర్జిత (భక్తులు డబ్బు కట్టి చేయుంచుకొనేవి)సేవలు ఈ ఆలయంలో జరుగుతాయి. ఇవన్నీ కూడా వ్యవసాయాభివృద్ధికి సంబంధించినవే ! అన్నింటి లోనికి విశేషమైనది పన్నెండేళ్ల కొకసారి నిర్వహించే "పళ్ళిప్పన్ " ఉత్సవాలు. పన్నెండు రోజులు జరిగే ఈ ఉత్సవాలు ఈ ప్రాంతంలో అతి పెద్ద సంబరంగా పేర్కొనవచ్చును.











వేలన్ వంశంవారి ఆధ్వర్యంలో నిర్వహించే ఈ పూజల వలన స్థానిక వాసులకు, వారి జీవాలకు, పంటలకు నరదృష్టి, గ్రహ దృష్టి, రాక్షస దృష్టి శోకవని, అందరూ సుఖసంతోషాలతో జీవిస్తారు అని చెబుతారు. ప్రతి సంవత్సరం మే నెల పదో తేదీ నుండి ఇరవై ఒకటో తేదీ వరకు జరిగే ఈ ఉత్సవాలలో (ఆఖరి సరి 2011లో జరిగాయి. తిరిగి జరిగేది 2023వ సంవత్సరం లోనే) కేరళ లోని అన్ని ప్రాంతాల నుండి భక్తులు తరలి వస్తారు.
ప్రతి సంవత్సరం మళయాళ క్యాలెండర్ "కొల్ల వర్షం" ప్రకారం మీనం (మార్చి-ఏప్రిల్)మాసం రెండో శుక్రవారం నాడు జరిగే "మలనాడ మలక్కూడ మహోత్సవం" కూడా విశేషమైనది !!  ఆవు, ఎద్దు, గుఱ్ఱము లాంటి రూపాలని కర్రలు, గడ్డితో చేసి వాటికి రంగురంగుల వస్త్రాలను అలంకరించి ఊరేగిస్తూ తెస్తారు. వీరంతా ఇంత అట్టహాసంగా తరలివచ్చేది ఇంటి పెద్ద అప్పూపన్ కి "కెట్టుకలశ" అంటే కానుకలు సమర్పించుకోడానికి !! సాయంత్రం మలనాడ ప్రతిష్టకు మూల రూపమైన "స్వర్ణ కొడి"(బంగారు ధ్వజం / బింబం)ని గజరాజుపైన ఊరేగిస్తారు.రాత్రంతా ఒక ప్రత్యేక నాట్య విధానంలో మహాభారతాన్ని ప్రదర్శిస్తారు.
పేరుకి ఇది ఒక రోజు ఉత్సవం అయినా ఎనిమిది రోజుల తరువాత "ఊరళి" (పూజారి) ఆధ్వర్యంలో రారాజు ఆబ్ధీకం జరిగే దాకా ప్రతి నిత్యం వేలాది మంది భక్తులు తరలి వస్తుంటారు అని చెబుతారు.
ఆలయంలో భక్తులు సమర్పించుకొని నివేదనలు చిత్రం గా ఉంటాయి.
పొగాకు కాడలు, వక్కకాయలు, ఉడికించిన దుంపలు, సారా, కొబ్బరి కల్లు తెస్తుంటారు. అనుకొన్న కోరికలు నెరవేరితే కోడి పుంజులను, మేకలను, కల్లు, కూరగాయలు సమర్పించుకొంటుంటారట. ఇందుకోసం ఒక పెద్ద తులాభారం కూడా ఏర్పాటు చేశారు మండపంలో!
ఆలయంలో భక్తులకు ఇచ్చే తీర్ధం కొబ్బరి కల్లు.








కర్ణ గద్దె 






మల నాడ పరిసరాలు ఎంతో ప్రశాంతంగా ఉండటమే కాదు పచ్చని ప్రకృతికి నిలయాలు.
చల్లని గాలి, నేత్రాలకు విందును చేసే ఏపుగా పెరిగిని వృక్షాలు, పచ్చని పొలాలు మనస్సుకు దేహానికి విశ్రాంతిని ప్రసాదిస్తాయి.
మలనాడ దుర్యోధన క్షేత్రానికి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది శకుని మామ కొలువైన "పవిత్రేశ్వరం".

స్థానిక సిద్దులు, మంత్రగాళ్ళు గురువుగా భావించి శకునికి ఒక ఆలయాన్ని నిర్మించారు.
ఇక్కడ మాత్రం పెద్ద నల్లరాతి మీద ఇద్దరు సేవకులు వింజామరలు వీస్తుండగా స్థానిక భంగిమలో ఉన్న శకుని విగ్రహం కనిపిస్తుంది.
ఇక్కడ కూడా పైకప్పు ఉండదు. ప్రాంగణమంతా ఎత్తైన చెట్లు, కోడి పుంజులు.
శ్రీ భగవతి అమ్మన్ ఆలయం ఉంటుంది.
రారాజు ఆలయంలో ఉత్సవాలు జరిగే సమయంలో ఈ ఆలయంలో కూడా ఉత్సవాలు నిర్వహిస్తారు.
నిత్య ధూప దీప నైవేద్యాలు జరుగుతుంటాయి.





శకుని మామ ఆలయం 









రారాజు తో పాటుగా విచ్చేసిన కర్ణునికి  కూడా చిన్న గద్దె మలనాడ లో ఏర్పాటు చేసారు.
మనకు అంతగా అర్ధం కాని సిద్దాంతాలు, సంప్రదాయాల సమ్మిళితమైన మలనాడ ఆలయాలు కొల్లం నుండి నలభై కిలోమీటర్ల దూరంలో ఉంటాయి. కొల్లం నుండి శాస్తంకొట్ట, భరణిక్కావు మీదగా ఇక్కడికి బస్సులు లభిస్తాయి.
కొల్లం చేరుకోడానికి దేశం నలుమూలల నుండి రైలు సౌకర్యం లభిస్తుంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...