5, సెప్టెంబర్ 2017, మంగళవారం

Ayodhya

అయోధ్య 

హిందువులకు అత్యంత పవిత్రమైన పురాణాలలో రామాయణానిది అగ్రస్థానం. 
అంతటి మహా గ్రంధానికి కేంద్ర బిందువు మరియు అవతార పురుషుడు శ్రీ రామ చంద్ర మూర్తి జన్మ స్థలం అయోధ్య. 
గతంలో సాకేత పురిగా పురాణాలలో ఉదహరించబడి తదనంతర కాలంలో అయోధ్యగా పిలవబడిన  ఈ క్షేత్రం సప్త ముక్తి క్షేత్రాలలో ఒకటి. (వారణాసి, మథుర,హరిద్వార్, ఉజ్జయిని, ద్వారక, కంచి మరియు అయోధ్య).








పురాణాలలో కోసల రాజ్యంగా పేర్కొనబడిన నేటి ఉత్తర ప్రదేశ్ ను ఇక్ష్వాకు వంశరాజులు అయోధ్య రాజధానిగా చేసుకొని పాలించారని అనేకానేక శాసనాలు మరియు గ్రంధాల ద్వారా తెలుస్తోంది.
అయోధ్య ప్రస్థాపన బ్రహ్మాండ,గరుడ,వామన మొదలైన పురాణాలలో పాటు అనేక బౌద్ధ మరియు జైన మత గ్రంధాలలో ఉన్నది. శాస్త్రవేత్తల ప్రకారం ఎన్నో వేల సంవత్సరాలక్రిందటే  ఈ ప్రాంతం జనావాసాలతో నిండి ఉండేదని తెలుస్తోంది.
 క్రీస్తు శకం అయిదవ శతాబ్దానికి చెందిన మహా కవి కాళి దాసు రచించిన "హరి వంశం"లో కూడా అయోధ్య గురించి విశదీకరించబడినది.








భారత దేశంలో జన్మించిన ప్రతి ఒక్కరికీ రామాయణం గురించి తప్పక తెలిసి ఉంటుంది.
వాల్మీకీ మహర్షి రచించిన ఆ మహా కావ్యానికి నాయకుడు దశరథ మహారాజ పుత్రుడైన శ్రీ దశరథ రాముడు. వైకుంఠ వాసుని సప్తమ అవతారం. ఆయన జన్మించిన పవిత్ర స్థలి అయోధ్య.
ఆయన నడత,నడవడిక, మాట, మన్నన, న్యాయ ధర్మ పాలనలో ఇలా ప్రతి ఒక్క దానిలో అందరికీ  ఆదర్శ ప్రాయుడు.
ఈ కారణం చేతనే ఆయనే కాదు ఆయన జన్మించిన నడయాడిన అయోధ్యా పురి కూడా అత్యంత పవిత్రమైనది హిందువులకు.








అలాంటి పావన క్షేత్రం క్రీస్తుపూర్వం ఒకటో శతాబ్దం నాటికి పూర్తిగా ఆనవాళ్లు లేకుండా పోయిందిట. 
ఆ సమయంలో రామాయణ గాధ విని ప్రేరణ పొందిన విక్రమాదిత్య మహారాజు( క్రీస్తు పూర్వం 57 వ సంవత్సరం) సరయూ నదీ తీరంలో అయోధ్యా పట్టణం గురించి అన్వేహణ మొదలుపెట్టారట. 
ఆ ప్రయత్నంలో సఫలీక్రులైన వారు నదీ తీరంలో ఇసుకలో కూరుకు పోయిన ఒక ఆలయ గోపురాన్ని కనుగొన్నారు. త్రవ్వకాలు జరపగా  నాటి రామాయణ కాలం నాటి ఎన్నో శిధిల భవనాలు వెలుగు లోనికి వచ్చాయట.  
తొలుతగా చూసిన ఆలయము శ్రీ రాముని కుమారుడు "కుశుడు"ప్రతిష్టించిన  "శ్రీ నాగేశ్వరనాథ ఆలయం"గా చెబుతారు. 





శ్రీ హనుమాన్ గద్దె 


దశరథ మహారాజు భవనం 




అలా బయల్పడిన వాటిని శాసనాధారాలతో పునః నిర్మించారట. ఆలా నిర్మించిన వాటినే నేడు మనం చూస్తున్న "శ్రీ హనుమాన్ గద్దె, కనక మహల్, దశరథ మహారాజ భవనం, రాముడు జన్మించిన స్థలం (నేడు వివాదాస్పదంగా ఉన్న ప్రదేశం),సీత దేవి వంట గది (సీత కీ రసోయి), శ్రీ నాగేశ్వరనాథ ఆలయం మొదలైనవి.
ఒక విషయం ఏమిటంటే అయోధ్యలో నివాస గృహాల కన్నా ఆలయాలు వాటి శిఖరాలే ఎక్కువ కనపడతాయి. చాలా వాటిల్లో ఎలాంటి దేవతా మూర్తులూ ఉండవు. కొన్ని శిధిలావస్థలో ఉన్నాయి. పెక్కు గృహాలు సుమారు రెండు నుండి మూడు వందల సంవత్సరాల క్రిందట నిర్మించబడినవిగా కనిపిస్తాయి.










అయోధ్యా పట్టణ సందర్శన శ్రీ హనుమాన్ గద్దె నుండి ప్రారంభించాలి అంటారు. చిన్న కొండ మీద ఉన్న ఈ ఆలయం నలువైపులా ఎత్తైన గోడలతో కోటలాగా నిర్మించబడినది.
పైకి చేరుకోడానికి మెట్ల మార్గం ఉంటుంది. రామాయణ కాలంలో శ్రీ ఆంజనేయుడు ఇక్కడి గుహలో నివసించేవారని చెబుతారు.
నేడు గర్భాలయంలో తల్లి అంజనా దేవి ఒడిలో బాల హనుమంతునిగా దర్శనమిస్తారు. నిశ్చల భక్తితో ప్రార్ధిస్తే సకల అభీష్టాలను నెరవేరుతాయి అన్నది భక్తుల విశ్వాసం.
అంజనా సుతుని దర్శించుకున్న తరువాత దగ్గరలో ఉన్న చక్రవర్తి దశరథ మహారాజ భవనం తరువాతి సందర్శనా స్థలం.







సువిశాల ప్రాంగణంలో నిర్మించబడిన ఈ భవంతిలో దశరథ మహారాజు తన కుటుంబ సభ్యులతో నివసించేవారట. చక్కటి నిర్మాణము. ఎన్నో రామాయణ గాధలను తెలిపే చిత్రాలు ఉంటాయి ఇక్కడ. భవన మధ్యలో ఉన్న మండపంలో దశరథ కుమారులు నలుగురు తమ పత్నులతో కొలువై ఉంటారు.
మధ్యాహాన్న హారతి సమయంలో ఆ చిన్న విగ్రహాలకు చేసే అలంకరణ అద్భుతంగా ఉంటుంది.
భవంతి లోని గదులు చాలా మటుకు మూసివేసే ఉంటాయి. క్రింద భాగాన్ని పూజారులు ఉపయోగించుకొంటుంటారు.














చక్రవర్తి దశరథ మహారాజ భవనం తరువాత రామ జన్మభూమి. ఇక్కడే అవతార పురుషుడు జన్మించారని చెబుతారు.
మొగలాయి చక్రవర్తి బాబర్ ఇక్కడ ఉన్న భవనాన్ని కూల్చి ప్రార్ధనా మందిరాన్ని నిర్మించాడని అంటారు. హిందువులు  అత్యంత పుణ్యప్రదమైన యాత్రగా దర్శనము గా భావించే ఇక్కడికి చేరుకోడానికి ఉన్న నిబంధనలు అన్నీ ఇన్నీ కావు.
భక్తులను సుమారు ఆరు చోట్ల తనిఖీ చేస్తారు. గడియారాలు, కెమెరాలు,మొబైల్ ఫోనులు, పెన్నులు,దువ్వెనలు, తాళాలు,మాత్రలు, మంచినీరు ఇలా ఏదీ తీసుకొని పోవడానికి వీలులేదు. వెదికిన ఖాళీ  జేబులను  పదే పదే వెతుకుతారు. చివరకి చుట్టూ భద్రతా దళాల పహారాలో కదల దానికి కూడా వీలు లేని సన్నని క్యూ లైన్లో పంపుతారు.
మనదేశంలో మన ఆరాధ్య దైవాన్ని దర్శించుకోవడానికి ఇంతటి నియమ నిబంధనలా ? అనిపిస్తుంది ప్రతి ఒక్కరికీ.










మనకు ఇక్కడ చిలక జోస్యం సాధారణ విషయం. ఉత్తర భారతంలో ముఖ్యంగా ఈ ప్రాంతంలో మన పిచ్చిక లాగా ఉండే "శ్యామా " అనే పక్షి చేత చీట్లు లాగించి జోస్యం చెబుతారు.
అయోధ్యలో ఈ పంజరాలు పెట్టుకొని ఎందరో కనిపిస్తారు.








కాళ్లకు చెప్పులు లేకుండా పైన ఎలాంటి కప్పు లేకుండా మండుటెండలో చాలా సమయం పంజరం లాంటి మార్గంలో నడిచి శ్రీ రాముడు పుట్టిన ప్రదేశం చేరుకొని తిరిగి వచ్చిన యాత్రీకుల తరవాతి గమ్యం కనక భవన్.
సీతా రాముల వివాహ సందర్బంగా కైకేయి వారికి ఇచ్చిన కానుకగా చెబుతారు.
సుందర భవనం.
ఎన్నో చిత్రాలు ఉంటాయి. ఒక పక్కన భవన చరిత్ర తెలిపే శిలా ఫలకం ఉంచారు. మధ్యలో ఉన్న మండపంలో సీతారాములు భక్తుల పూజలు అందుకొంటుంటారు.












కనక భవన్ 




అద్దాల మందిరం (సీసా మహల్)








సరయూ నదీ తీరంలో ఉంటుంది శ్రీనాగేశ్వరనాథ్ ఆలయం.  చక్కటి చిన్న మందిరం. భక్తులు నేరుగా అభిషేకాలు చేసుకొనే వీలు ఉన్నది.
గణేషాది ఇతర దేవీ దేవతలు కూడా ఈ మందిరంలో కొలువుతీరి ఉంటారు.
శ్రీరామ చంద్రుడు తన కుమారులైన లవ కుశులకు పట్టాభిషేకం చేసి లక్ష్మణునితో కలిసి సశరీరంగా అవతార సమాప్తి చేసిన ప్రదేశం లోనే ప్రతి నిత్యం సాయం సంధ్యా సమయంలో సరయూ హారతి నిర్వహిస్తారు.
ప్రశాంత సంధ్యా సమయంలో దినకారుని అరుణారుణ కాంతులకు సమానమైన దీప కాంతులతో వెలిగిపోయే సరయూ అందాలను సుందరంగా నిర్మించిన ఘాట్ల మీద కూర్చొని వీక్షించగలమే కానీ  వర్ణింప శక్యం కాదు.
సీత కి రసోయి లాంటివి ప్రస్తుతం పూర్తిగా శిధిలావస్థలో ఉన్నాయి.




శ్రీ నాగేశ్వరనాథ్ లింగం 






శ్రీనాగేశ్వర నాథ్ ఆలయం 















శిధిలావస్థలో ఉన్న నిర్మాణాలను పునః నిర్మించి,ఉన్న వాటి వివరాలు తెలిపే బోర్డులు పెట్టి భక్తులకు సరి అయిన సదుపాయాలను కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
అయోధ్యలో యాత్రీకులు ఉండటానికి మఠాలు మరియు సత్రాలు పరిమిత సంఖ్యలో ఉన్నాయి.
ఉండటానికి ఒకే ఒక లాడ్జి ఉన్నది. హోటల్ రామప్రస్థ. ఇక్కడ కూడా పరిమితి సంఖ్య లోనే గదులు ఉంటాయి.














దక్షిణ భారత దేశంలో ఆరంభమైన భక్తి సాహిత్యోద్యమం ద్వారా వ్యాప్తి లోనికి వచ్చిన శ్రీ వైష్ణవ ఆళ్వారులలో తిరుమంగై ఆళ్వార్, పెరియాళ్వార్, కులశేఖరాళ్వార్, తొండరడిప్పొడి ఆళ్వార్ మరియు నమ్మాళ్వార్ తమ పాశురాలలో శ్రీ రామచంద్రుని "చక్రవర్తి తిరుమగన్ (చక్రవర్తి కుమారుడు)"గా కీర్తించారు.  

భారత దేశ నలుమూలల నుండి అయోధ్యకు చేరుకోడానికి రైలు,విమాన మార్గాలు ఉన్నాయి.
అతిదగ్గర లోని రైల్ స్టేషన్ "ఫైజా బాద్ " (7 కిలో మీటర్లు). ఇక్కడ అన్ని రకాల వసతి సౌకర్యాలు లభిస్తాయి.
వారణాసి నుండి ఘోరక్ పూర్ నుండి ప్రతి పావు గంటకీ బస్సులు లభిస్తాయి.
భారతీయునిగా, ఒక హిందువుగా జనించిన ప్రతి ఒక్కరూ తప్పక దర్శించవల్సిన క్షేత్రం అయోధ్య.

జై శ్రీ రామ్ !!!!


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...