Tuesday, December 12, 2017

Ahobhilam

                     నవ నారసింహ క్షేత్రం, అహోబిలం 
మన తెలుగు రాష్ట్రాలలో పెక్కు నరసింహ ఆలయాలున్నాయి. 
మంగళగిరి, వేదాద్రి, మట్టపల్లి, యాదాద్రి ఇలా ఎన్నో ఉన్నాయి. కానీ భారత దేశం లోని నాలుగు నారసింహ క్షేత్రాలలో ఒకటి అయిన అహోబిలం చాలా పవిత్రమైనది మరియు ప్రత్యేకమైనది. 
స్వయంవ్యక్త క్షేత్రం గాను, శ్రీ వైష్ణవ దివ్య దేశాలలో ఒకటి గాను, ఒకే ప్రదేశంలో తొమ్మిది నారసింహాలు కొలువు తీరిన చోటుగాను ఇలా ఎన్నో విధాలుగా  ప్రసిద్ధి చెందినది అహోబిలం.
శ్రీ హరి నర సింహ రూపంలో ఇక్కడ కొలువైన విషయాన్ని తెలిపే గాధ సత్య యుగం నాటిది.
దిగువ సన్నిధి 

జ్వాలా నారసింహ 


వైకుంఠ ద్వారపాలకులైన జయవిజయులు, శ్రీ వారి దర్శనానికి విచ్చేసిన బ్రహ్మమానస పుత్రులైన సనక సనందనాదులను అడ్డగించి శాపగ్రస్తులైనారు. వారు శ్రీమన్నారాయణునికి తాము సన్నిధిని విడిచి ఉండలేమని మార్గోపాయం తెలుపమని ప్రాధేయపడ్డారు.
ముని శాపాన్ని తాను తొలగించలేనని, కాకపోతే మార్పు చేయగలనని తెలిపి, ఏడు జన్మలు హరి భక్తులుగానో లేదా మూడు జన్మలు హరి కి వైరులుగానో భూలోకంలో గడపడానికి ఒక దానిని కోరుకోమన్నారు వైకుంఠ వాసుడు. ఎంత తొందరగా తిరిగి వైకుంఠం చేరుకోవాలా అన్న తపనతో వారు రెండో దానినే ఎంచుకొన్నారు.
అలా వారు ఎత్తిన తొలి జన్మ దితి, కశ్యప మహర్షి దంపతులకు కుమారులైన హిరణ్యాక్ష హిరణ్యకశిపులు. వరబలంతో లోకకంటకులుగా మారారు. పరంధాముడు వరాహావతారం ధరించి
హిరణ్యాక్షవధ జరిపారు. సోదరుని మరణంతో ఆగ్రహించిన హిరణ్యకశిపుడు తపస్సుతో విధాతను మెప్పించి ఎవరి చేత మరణం సంభవించకుండా వరం పొందాడు.
వరగర్వంతో ఇంద్రాది దేవతలను ఓడించి, మరింత అహంకారంతో మునులను, సాధు జనులను ఇక్కట్ల పాలు చేయసాగాడు.
అతని కుమారుడైన ప్రహ్లాదుడు జన్మతః హరి భక్తుడు. కుమారుని మార్చడానికి సామదాన భేద దండోపాయాలను ప్రయోగించి విఫలుడైనాడు హిరణ్యకశిపుడు.  హరి సర్వాంతర్యామి అన్న కుమారుని సమాధానంతో రెట్టించిన అసహనం మరియు కోపంతో  ఈ స్తంభంలో ఉన్నాడా నీ హరి అని ప్రశ్నించి బలంగా మోదగా దాని నుండి ఉద్భవించారు, సింహ మొహం, మానవ శరీరం తో భీకర గర్జనలు చేస్తూ నరసింహ స్వామి.
సృష్టికర్త అసురునికి అనుగ్రహించిన వరం లోని లోపాలను అనుసరించి, మనిషి, మృగం కాని రూపం, ఇంటా బయటా కాకుండా గడప మీద, ఉదయం రాత్రి కాకుండా సంధ్యాసమయంలో, గోళ్లనే ఆయుధంగా చేసుకొని అత్యంత ఉగ్రంగా హిరణ్య కశ్యపుని వధించారు.
ఎంతకీ నృసింహుడు  ఉగ్రత్వం వీడక పోవడంతో పరమశివుడు ప్రహ్లాదుని ప్రార్ధించమని కోరారు. బాల భక్తుని స్తోత్ర పాఠాలకు శాంతించి గుహలో కొలువు తీరారు. ఆ దృశ్యాన్ని వీక్షించిన సమస్త దేవతలు, మునులు, "అహో బల ! మహా బల ! అహోబల !" అంటూ కైవారాలు చేశారు.
ఆ విధముగా అహోబలం అన్న పేరు వచ్చినది. కాలక్రమంలో దైవం బిలంలో కొలువైన క్షేత్రంగా అహోబిలం గా మార్పు చెందినది.
బ్రహ్మాండ పురాణం, విష్ణు పురాణం, నృసింహ పురాణం, భాగవత పురాణం, హరివంశం ఆదిగా గల గ్రంధాలలో శ్రీ నృసింహ మరియు అహోబిల ప్రస్థాపన కలదు.
శ్రీరామచంద్ర మూర్తి, జగద్గురు శ్రీ ఆది శంకరాచార్యులు, శ్రీ వైష్ణవ గురువులు శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్యులు ఈ క్షేత్రాన్ని సందర్శించి శ్రీ నారసింహుని సేవించుకొన్నట్లుగా వివిధ పురాణాల ద్వారా అవగతమవుతోంది.
కలియుగ దైవం శ్రీ వేంకటేశ్వరుడు పద్మావతీ దేవితో తన వివాహానంతరం ఈ క్షేత్రానికి విచ్చేసి దిగువ సన్నిధిగా పిలవబడుతున్న శ్రీ ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహ స్వామి వారిని ప్రతిష్టించి పూజించుకొన్నారని తెలియవస్తోంది.

కారంజ నారసింహ 

ఖ్రోడా నారసింహ 

మాలోల నరసింహుడు 
అహోబిల క్షేత్రం నల్లమల అరణ్య మధ్య భాగంలో శేషాద్రి మీద గరుడాద్రి మరియు వేదాద్రి పర్వతాల నడుమ ఉంటుంది ఇక్కడి ప్రకృతి సౌందర్యానికి ముగ్ధుడైన ఆదిశేషుడు విశ్రమించాడట. ఆకారణంగా శేషాద్రి అన్న పేరు వచ్చినదట. తల భాగంలో శ్రీ శ్రీనివాసుడు, నడుము మీద అహోబిల నారసింహుడు, తోక భాగంలో శ్రీశైల భ్రమరాంబిక సమేత మల్లిఖార్జున స్వామి కొలువుదీరి ఉంటారు. శ్రీ శైలం ద్వాదశ జ్యోతిర్లింగాలలో, అష్టాదశ పీఠాలలో భాగం కాగా, శ్రీ వెంకటాచలం కలియుగ వైకుంఠంగా, శ్రీ వైష్ణవ దివ్యదేశాలలో ఒకటిగా పేరొందినది.
ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రెండు దివ్య తిరుపతులలో రెండవది అహోబిలం.
పన్నిద్దరు ఆళ్వారులలో తొమ్మిది మంది అహోబిల క్షేత్రం గురించి పాశుర గానం చేసారు.
శ్రీనాధ కవి సార్వభౌముడు, పోతనామాత్యుడు, అన్నమాచార్యులు మొదలైన కవి భక్తులు అహోబిల మహత్యాన్ని ఘనంగా కీర్తించారు.
"ఉగ్రం వీరం మహావిష్ణుం జ్వలంతం సర్వతోముఖం !! నృసింహం భీషణం భద్రం మృత్యు మృత్యుం నమామ్యహం !!!" అన్న నృసింహ మంత్రరాజము ప్రకారం మరే దివ్య స్థలంలో లేని విధంగా ఇక్కడ నవ నరసింహులు కొలువై ఉంటారు.
శ్రీ వెంకటేశ్వర స్వామి నిర్మించిన దానితో మొత్తం పది ఆలయాలుంటాయి అహోబిలంలో!
దిగువ సన్నిధితో కలిపి భార్గవ, యోగానంద, చత్రవట, పావన నరసింహ ఆలయాలుండగా, పర్వత పైభాగానికి వెళ్లే దారిలో "కారంజ నరసింహ," ఎగువన శ్రీ అహోబిల నరసింహ, ఖ్రోడా, మాలోల, జ్వాలా నరసింహ ఆలయాలుంటాయి.


శ్రీ ఆదివణ్ శఠగోప యతీంద్ర దేశికులు  

శ్రీ ప్రహ్లాద వరద లక్ష్మీ నరసింహుడు (దిగువ సన్నిధి)

కాకతీయ ప్రతాప రుద్ర దంపతులు 
ఎగువ ఆలయంలో తొడలమీద హిరణ్య కశపుని పట్టుకొన్న భంగిమలో స్వామి దర్శనమిస్తారు. పాదాల వద్ద ప్రహ్లాదుడు నమస్కార భంగిమలో ఉంటాడు. పక్కనే స్వామిని అర్చిస్తున్న మహాదేవుడు, శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీరామచంద్ర స్వామి కొలువై ఉంటారు. మరో ఉపాలయంలో స్థానిక చెంచులు తమ సహోదరిగా ఆరాధించే శ్రీ చెంచులక్ష్మి సన్నిధి కూడా ఉంటుంది. కాకతీయ ప్రతాప రుద్రుడు ఆలయ నిర్మాత. తదనంతర కాలంలో రెడ్డి రాజులూ, విజయనగర రాజులు అభివృద్ధి చేశారు.
ఎగువన శ్రీ అహోబిల నరసింహ సన్నిధి దర్శించుకొని అడవి లోనికి నడుచుకొంటే వెళితే ఒక  కిలోమీటరు  తరువాత వస్తుంది శ్రీ ఖ్రోడా నరసింహ ఆలయం.
భూదేవితో సహా వేదాలను అపహరించుకొని పోయిన సోమకాసురుని సంహరించిన వరాహ రూపం, హిరణ్యకశపుని చేతిలో చిత్ర హింసలకు గురౌతున్న ప్రహ్లాదుని కాపాడిన నారసింహ రూపం రెండు కలగలసినదే ఖ్రోడా నరసింహ స్వామిది. శ్రీదేవి, భూదేవి సమేతంగా ఉంటారు. నాసికాగ్ర భాగాన రాక్షసుని శరీరం కనపడుతుంది. పక్కనే శ్రీ లక్ష్మీ నరసింహ మూర్తి కూడా  ప్రతిష్టించారు.  సింహాచలంలో ఉన్నది కూడా ఈ రూపమే!
పక్కన పారే భవనాశని ప్రవాహాన్ని, సూర్య కిరణాలు కూడా ప్రవేశించలేనంత దట్టంగా పెరిగిన చెట్ల మధ్య నుండి నడుస్తూ సాగితే పైన ఉంటుంది శ్రీ జ్వాలా నరసింహ ఆలయం.
భవనాశని పుట్టుక ఇక్కడి నుండే !పక్కనే మరింత పైకి ఎక్కితే నృసింహుడు వెలుపలికి వచ్చిన ఉగ్రస్థంభంగా పేర్కొనే నిటారైన గోడ మాదిరి ఉండే పర్వతం ఉంటుంది. ఎగువ సన్నిధి నుండి ఇక్కడికి సుమారు నాలుగు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. స్వామి అష్టభుజుడు. రెండు చేతులతో అసురుని తల, పాదాలను పట్టుకొనగా, రెండింటి నఖాలతో అతని ఉదరకోశాన్ని చీలుస్తూ, మరో రెండు చేతులతో అసురుని ప్రేగులను మేడలో వేసుకొంటూ, మిగిలిన హస్తాలతో శంఖు చక్రాలను ధరించి ఉంటారు. ఎడమ పక్కన ముకుళిత హస్తాలతో నిలుచొని ఉంటాడు ప్రహ్లాదుడు.
అసుర సంహారానంతరం స్వామి తన హస్తాలను శుభ్ర పరుచుకున్న "రక్త కుండం " ఇక్కడే ఉంటుంది. చూస్తే అందులోని నీరు ఎర్రగా కనిపిస్తుంది. చేతిలోకి తీసుకొంటే మామూలుగానే కనిపిస్తాయి.
జ్వాలా, ఉగ్రస్థంభం దర్శించుకొని చక్కగా నిర్మించిన మెట్ల మార్గంలో క్రిందికి వస్తుంటే కనపడే కొండ గుహ ను "ప్రహ్లాద బడి " అని పిలుస్తారు. రాక్షస గురువు చెండామార్కుల వారి వద్ద ప్రహ్లాదుడు ఇక్కడే విద్య నేర్చుకొన్నట్లుగా చెబుతారు. గుహాంతర్భాగం పైన కొన్ని చిత్రమైన అక్షరాలు లిఖించబడి ఉంటాయి.
మరింత క్రిందకి వస్తే ఎదురవుతుంది శ్రీ మాలోల నారసింహ సన్నిధి. మాలోల అనగా లక్షీ ప్రాణనాధుడు అని అర్ధం. ఉపస్థిత భంగిమలో ఉన్న స్వామి వారి ఎడమ తొడపైన కూర్చొని ఉంటారు శ్రీ లక్ష్మీ దేవి. చతుర్భుజ స్వామి శంఖుచక్రాలను ధరించి, ఎడమ చేతితో అమ్మవారిని కౌగలించుకొని, కుడి అభయ హస్తముతో భక్తులను అనుగ్రహిస్తుంటారు. సౌమ్య మూర్తి. అహోబిల మఠ పీఠాధిపతులు యాత్రల సందర్బంగా నిత్యపూజలు చేసుకోడానికి వెంట తీసుకొని వెళ్లే ఉత్సవమూర్తి ఈ స్వామిదే !!!

ఉగ్ర స్థంభం 

రంగరాయల విజయ స్థంభం 


రక్త కుండం 


ఎగువ సన్నిధి నుండి క్రిందకి వస్తుంటే మధ్యలో ఉంటుంది కారంజ నరసింహ మందిరం. కారంజ వృక్షం క్రింద పద్మాసనంలో దర్శనమిస్తారు. చిత్రంగా చేతిలో ధనుర్భాణాలు ఉంటాయి. శ్రీ ఆంజనేయుడు ఇక్కడ తపస్సు చేశారట. సాక్షాత్కరించిన నృసింహుని నీవెవరు నాకు తెలీదు. తెలిసిన దైవం శ్రీ రాముడే ! అనగా స్వామి విల్లును పట్టుకొని కనపడ్డారట. 
మూలవిరాట్టు నుదిటిన మూడో నేత్రం ఉండటం మరో విశేషం. 
దిగువ అహోబిలానికి సుమారు రెండు కిలోమీటర్ల దూరంలో నెలకొని ఉంటుంది శ్రీ భార్గవ నారసింహ ఆలయం. పరశురాముడు ఈ ప్రదేశంలో తపస్సు చేయగా శంఖుచక్రాలతో, అసురుని ఉదరం చీలుస్తున్న రూపంలో స్వామి దర్శనమిచ్చారు. 
కొద్దిగా ఎత్తులో ఉండే ఈ ఆలయం చుట్టూ పచ్చని అడవి విస్తరించి ఉంటుంది. 
దిగువ సన్నిధికి దక్షిణంగా అన్నదాన పితామహుడు, అవధూత శ్రీ కాశీనాయన ఆశ్రమానికి చేరువలో ఉంటాయి శ్రీ యోగానంద మరియు శ్రీ చత్రవట నరసింహ సన్నిధులు. 
ప్రహ్లాదునికి స్వామి ఇక్కడ యోగ విద్యను నేర్పించారట. మూలవిరాట్టు యోగబంధనంతో చతుర్బాహువుగా దర్శనమిస్తారు. 
శంఖుచక్రాలను వెనక హస్తాలతో ధరించి, ముందు ఎడమచేతితో తొడమీద తాళం వేస్తూ, కుడి చేతి అభయ ముద్రతో భక్తులను కాచేవాడు శ్రీ ఛత్రవట నరసింహుడు.  ఇక్కడ ఇద్దరు గంధర్వులు స్వామివారిని తమ సంగీతంతో అలరించారట. ప్రసన్న స్వరూపి ఛత్రవటుడు. 
ముఖ మండపంలో చప్పట్లు కొడితే జవాబుగా వీణ మీటిన ధ్వని స్ఫష్టంగా వినిపించడం ఒక విశేషం. 
దిగువ ఆలయం నుండి పదిహేను కిలోమీటర్లు వాహనంలో, ఎగువ నుండి ఏడు కిలోమీటర్లు కాలినడకన వెళితే చుట్టూ ఎత్తైన కొండల నడుమ కొలువై ఉంటారు పాములేటి స్వామిగా భక్తులు ప్రేమగా పిలుచుకునే శ్రీ పావన నరసింహుడు. 
భరద్వాజ మహర్షికి శ్రీ మహాలక్ష్మీ సమేతంగా దర్శనము ప్రసాదించారు శ్రీ పావన నరసింహుడు. 
ప్రతి నిత్యం విశేష సంఖ్యలో భక్తులు వస్తుంటారు. శనివారాలలో మరింత అధిక సంఖ్యలో విచ్చేస్తారు. 
వర్షాకాలంలో ఈ క్షేత్రాన్ని చేరుకోవడం ఇబ్బందులతో కూడుకున్నది. శ్రీ భార్గవ నరసింహ 

భవనాశని ప్రవాహం 

శ్రీ ఛత్రవట నరసింహ ఆలయం 


దిగువ శ్రీ ప్రహ్లాదవరద శ్రీ లక్ష్మి నరసింహ స్వామి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వరుని ప్రతిష్ఠ. ఆలయాన్ని కాకతీయులు, రెడ్డి రాజులూ, విజయనగర పాలకులు, స్థానిక జమీందార్లు, పీఠాధిపతులు, ఇలా ఎందరో వివిధ కాలాలలో తమ వంతు కైంకర్యంగా ఆలయాన్ని అభివృద్ధి పరిచారు.
ఈ ఆలయంలో విజయనగర శైలిలో నిర్మించబడిన రాజగోపురం, కల్యాణ మండపము, వసంత మండపము, రంగ మండపము కనిపిస్తాయి. నవ నరసింహులు దర్శించుకోలేని వారి కొరకు రంగ మండప స్తంభాల పైన ఆ రూపాలను సుందరంగా మలచారు.
అద్భుత శిల్పాలు కనిపిస్తాయి రంగ మండపంలో.
అహోబిల మఠ స్థాపకులైన శ్రీ ఆదివణ్ శఠగోప యతీంద్రుల విగ్రహం కూడా ఉంటుందీ మండపంలో.
కాకతీయ ప్రతాపరుద్రుడు అపర శివ భక్తుడు. ప్రతి నిత్యం ఒక బంగారు లింగాన్ని పోత పోయించి, అర్చించి, బ్రాహ్మణులకు దానం ఇచ్చేవాడట. ఒకసారి ఈ ప్రాంతంలో బస చేసి పూజకు సిద్దపడగా ఎన్ని మార్లు పోత పోసినా శివ లింగానికి బదులు శ్రీ నరసింహ ప్రతిమ   రాసాగిందట.
నాటి రాత్రి కలలో శ్రీ నృసింహుడు కనపడి ఇది తన క్షేత్రం అని తెలిపి, మరునాడు కర్ణాటక ప్రాంతం నుండి ఇక్కడి వస్తున్న బ్రాహ్మణునికి ఆ విగ్రహాన్ని కానుకగా ఇవ్వమని సెలవిచ్చారట.
అలా మరునాడు వచ్చిన శ్రీ కిదాంబి శ్రీనివాసులుకు విగ్రహాన్ని, ఆలయ నిర్వహణా భాద్యతను అప్పగించారటశ్రీ ప్రతాప రుద్రుడు. ఆ శ్రీనివాసులే అహోబిల మఠ స్థాపకులైన శ్రీ ఆదివణ్ శఠగోప యతీంద్రులు.
ప్రాంగణంలో శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధి కూడా ఉంటుంది.  శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి, ఆండాళ్ కొలువుతీరి భక్తులను ఆదరిస్తుంటారు.


శ్రీ యోగ నారసింహ 

శ్రీ యోగ నారసింహ ఆలయం 


అహోబిల నారసింహ ఆలయం (ఎగువ సన్నిధి) 
ఎంతో ప్రశాంతతకు, ప్రకృతి రమణీయతకు, మనసులకు శాంతిని అందించే ఆధ్యాత్మికతకు పెట్టింది పేరు అహోబిలం.
నంద్యాల, శ్రీశైలం, కర్నూలు, కడప, అనంతపురం మరియు తిరుపతి నుండి ఆళ్ళ గడ్డ మీదగా రహదారి మార్గంలో ఇక్కడికి చేరుకోవచ్చును.
వసతి శ్రీ మాలోల గెస్ట్ హౌస్, శ్రీ హరిత రిసార్ట్స్ లో లభిస్తుంది. దేవాలయం వారి అన్న సత్రాలలో చక్కని భోజనం పెడతారు. కాకపోతే ముందుగా తెలియచెప్పాలి.
శని మరియు ఆది వారాలు రద్దీ ఎక్కువగా ఉంటుంది.

నమో నారాయణః !!!!  

Monday, December 11, 2017

Azhagar Kovil,

                              అళగర్ పెరుమాళ్ కోవెల 


మధురై చుట్టుపక్కల ఉన్న ఆరు శ్రీ వైష్ణవ దివ్యదేశాలలో ప్రముఖమైనదిగా పేరు పొందినది అళగర్ పెరుమాళ్ కోవెల.
శ్రీ వైష్ణవ దివ్య తిరుపతి గానే కాకుండా శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఆరు పాడై వీడు ఆలయాలలో ఒకటైన "పలమదురై చోళై" కూడా ఇక్కడే ఉన్నది.
అళగర్(అందమైన ) పర్వత పాదాల వద్ద ఉన్న ఈ దివ్య దేశం పాండ్య నాడు గా చరిత్రలో పేర్కొనబడిన నేటి మధురై నగరానికి ఇరవై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్నది. పచ్చని చెట్లతో,  జలప్రవాహాలతో అత్యంత సుందర ప్రకృతికి నిలయాలు ఈ వృషభాద్రి శ్రేణి !
బ్రహ్మాండపురాణం, వరాహ పురాణం, ఆగ్నేయ పురాణం, స్కాంద పురాణం  మరియు అనేకానేక పురాతన గ్రంధాలూ ఈ క్షేత్ర మహత్యాన్ని ఎంతో గొప్పగా పేర్కొన్నాయి.
గ్రంధాలూ, పురాణాలు, ఆళ్వారుల పాశురాలు వృషభాద్రిని ముక్తి క్షేత్రం గా కీర్తించాయి.
శ్రీదేవి మరియు సుందరవల్లీ తాయారు సమేత శ్రీ అళగర్ పెరుమాళ్ ఈ దివ్య తిరుపతిలో కొలువైన పురాణ గాధ కూడా పెక్కు గ్రంధాలలో లిఖించబడినది.


మలయధ్వజ పాండ్య రాజు తనకు ఇంద్రుడు ప్రసాదించిన పుష్పక విమానంలో ప్రతి నిత్యం కాశీ క్షేత్రం వెళ్లి గంగాస్నానం చేసి, విశ్వనాధుని సేవించుకొని, గయా క్షేత్రం లోని గంగాధరుని కూడా పూజించుకొని తిరిగి మధురై చేరుకొనేవాడట. ఒకనాడు మార్గం మార్చి వృషభాద్రి మీదగా వస్తుండగా విమానం గగనాన నిలిచిపోయినదిట.
విషయం అర్ధం కానీ పాన్ పాండ్య రాజుకు అశరీర వాణి విపించిందిట. ఈ పర్వతాలు లోక రక్షకుడైన శ్రీ హరి కొలువైనవి గా ఆ వాణి తెలిపిందిట.
క్రిందకు దిగిన రాజు "నూపుర గంగా" తీర్ధంలో స్నానమాచరించి పాదాల వద్ద కొలువైన శ్రీ అళగర్ పెరుమాళ్ ను సేవించుకొన్నారట. ఆయనే తొలి ఆలయాన్ని నిర్మించినట్లుగా చెబుతున్నాయి గ్రంధాలు.
ప్రస్తుత ఆలయం ఎనిమిదో శతాబ్దంలో నిర్మించబడినట్లుగా శాసనాధారాలు తెలుపుతున్నాయి.

సువిశాల ప్రాంగణానికి చుట్టూ కోట గోడలాంటి ఎత్తైన ప్రహరీ నిర్మించారు. ప్రస్తుతం కొంతమేర శిధిలమైనది.
ప్రాంగణం లోని ప్రధమ సన్నిధి శ్రీ భైరవునిది. ఈయన క్షేత్ర పాలకుడు.  గతంలో రాత్రి పూజాదికాలు పూర్తి అయిన తరువాత పూజారి ఆలయ తాళాలను క్షేత్ర పాలకునికి ఇచ్చి, తిరిగి ఉషోదయాన తీసుకొని ఆలయాన్ని తెరిచేవారట.
ఒకనాటి రాత్రి ఇంటికి చేరుకున్నాక పూజారికి తన కుమారుని ఆలయంలో ఉంచి తాళాలు వేసినట్లుగా గ్రహింపు కలిగిందిట. పరుగు పరుగున ఆలయానికి చేరుకొని భైరవుని తలుపులు తెరిచి తన పుత్రుని బయటకు పంవలసినదిగా అర్ధించాడట. దానికి అంగీకరించని భైరవుడు అతని కుమారునికి వచ్చిన ఆపద ఏమీ లేదన్నాడట.
కానీ ఆందోళన చెందుతున్న పూజారీ ఆగ్రహించాడట. కోపించిన క్షేత్రపాలకుడు అతని కుమారుని వెలుపలకు విసిరివేశారట. గాయపడిన పుత్రుని చూసి అతని పరిస్థితికి మరింత ఆగ్రహించిన పూజారి,  భైరవుని శక్తులను తన మంత్ర ప్రభావంతో సంగ్రహించి ఒక రాతిలో నిక్షిప్తం చేసాడట. నేటికీ భైరవుని సన్నిధికి ఎదురుగా ఉన్న "క్షేత్రపాలక శిల"ను చూడవచ్చును.
మరో విశేషం ఏమిటంటే సహజంగా శివాలయాలలో కొలువై ఉండే సప్తమాత్రికలు ఇక్కడ ఉండటం ! వీరికి నియమంగా నిత్య పూజలు జరుగుతాయి.
ఆలయ ఉత్తర భాగాన కొలువైన శ్రీ జ్వాలా నారసింహ సన్నిధి పైభాగాన ఒక పెద్ద రంధ్రం ఉంటుంది. స్వామి వారి నుండి వెలువడే ఆగ్రహ జ్వాలలు దాని నుండి ఆకాశం వైపుకి వెళతాయని, భక్తులు స్వామివారి అనుగ్రహ జ్వాలలను పొందుతారని చెబుతారు.
మరో ప్రత్యేక సన్నిధి రాజ గోపురం ద్వారం వద్ద ఉన్న శ్రీ కరుప్ప స్వామిది. ఈయననే పదునెట్టాంపడి కరుప్పస్వామి అని కూడా పిలుస్తారు. రాజ గోపుర ప్రధాన ద్వారం వద్ద  గంధపు చెక్కలతో చేసిన తలుపులను అమర్చారు. కరుప్ప స్వామి పూజలన్నీ ఈ తలుపుల వద్దనే జరుగుతాయి. ప్రత్యేక ఉత్సవాలప్పుడు మాత్రమే ఈ తలుపులను తెరుస్తారు.
కురువ కులస్థులు ఈ సన్నిధికి పూజారులుగా వ్యహరిస్తారు. చుట్టుపక్కల గ్రామాల వారు దొంగతనాలు, మోసం లాంటివి జరిగినప్పుడు నేరస్థులను ఇక్కడికి తీసుకొని వచ్చి ప్రమాణం చేయమంటారు. కరుప్ప స్వామి ముందు ఎవరు అసత్యం చెప్పారన్నది వారి విశ్వాసం.
ఆషాడ మాస అమావాస్య మరియు పౌర్ణమికి విశేష పూజలు శ్రీ కరుప్ప స్వామికి చేస్తారు.
మరో విశేషం ఏమిటంటే పర్వదినాలలో శ్రీ పెరుమాళ్ కి అలంకరించే నగల వివరాలను ఈయన సమక్షంలో చదివి, ఊరేగింపు తరువాత మరోసారి సరి చూసుకొన్నాకే పెరుమాళ్ ఆలయం లోనికి వస్తారు.


పర్వత శిఖరాన ఉన్నఅనేక తీర్ధాలలో నూపుర గంగ ఒక పవిత్ర జలధార. ఈ నీటికి సర్వపాపాలు హరించే శక్తి ఉన్నదని భక్తులు విశ్వసిస్తారు.  అరుదైన వనమూలికలు సారాన్ని నింపుకున్న నీరు ఆరోగ్యప్రదాయనిగా భావిస్తారు. సీసాలలో గృహాలకు తీసుకొని వెళుతుంటారు.
శ్రీ సుందరరాజ పెరుమాళ్ కోవెల కొండ క్రింద ఉండగా, అగ్రభాగాన నూపుర గంగా, మధ్యలో శ్రీ సుబ్రహ్మణ్య సన్నిధి ఉంటాయి.
నిత్యం ఎన్నో పూజలు శ్రీ అళగర్ పెరుమాళ్ కి జరుపుతారు. ఉత్సవ మూర్తి శ్రీ సుందర రాజ పెరుమాళ్" విగ్రహాన్ని అరుదైన "అపరంజి" అని పిలిచే బంగారం తో తయారు చేసారు. నిత్య అభిషేకాలలో నూపుర గంగా జలాన్ని వాడాలి. లేని యెడల విగ్రహం నల్లగా మారిపోతుంది. పూజారులు రోజు పైకి వెళ్లి నీటిని తెస్తారు. వారు నిజంగా గంగ నీటినే తెచ్చారా ? అన్నదానికి వారి శ్రీ కరుప్ప స్వామి వద్ద ప్రమాణం చేసిన తరువాతనే నీటిని అభిషేకాలకు వినియోగిస్తారు.
నూపుర గంగ దాకా రహదారి మార్గం ఉన్నది. నడిచి కూడా వెల్లడానికి మెట్లు, దారి ఉన్నాయి. పరిసరాలు, ప్రకృతి ఆహ్లాదకరంగా ఉంటాయి.
అళగర్ పెరుమాళ్ కోవెలలో ప్రతి నిత్యం ఉత్సవమే !
అన్నింటి లోనికి శ్రీ మీనాక్షీ సోమసుందరేశ్వర స్వామి వార్ల కల్యాణ మహోత్సవానికి స్వామి వారు తరలి వెళ్లే "చిత్తిరై తిరువిళ్ల" ఒక అద్భుతమైనది.
మొత్తం తొమ్మిది రోజులలో మొదటి మూడు రోజులు ఇక్కడ, నాలుగు రోజులు మధురై వైగై నదీ తీరంలో, రెండు  రోజులు వెళ్లి రావడానికి ! ఈ తొమ్మిది రోజులు పెరుమాళ్ కి ఎన్నో రకాల అలంకరణలు చేస్తారు.  సోదరి వివాహానికి తరలి వెళ్లే సోదరుడు ఎంత సుందరుడైన, సరైన అలంకారం ఉండాలి కదా !
వైగై నది ఒడ్డున జరిగే ఉత్సవం చూడటానికి లక్షలాది మంది తరలి వస్తారు.ప్రస్తుత ఆలయాన్ని ఎనిమిదో శతాబ్దంలో పాండ్య రాజులు నిర్మించారు. తదనంతర కాలంలో చోళులు, విజయనగర రాజులు, నాయక రాజులు పెక్కు నిర్మాణాలను నిర్మించారు. ఆలయాన్ని అభివృద్ధి చేసారు. చక్కని శిల్పాలకు నెలవు ఈ ఆలయం.
రోజూ వేలాది మంది భక్తులు ఈ క్షేత్రానికి తరలి వస్తుంటారు.  మధురై పెరియార్ బస్టాండ్ నుండి బస్సులు లభిస్తాయి.శ్రీ కరుప్ప స్వామి సన్నిధి 


పెరియాళ్వార్, ఆండాళ్, తిరుమంగై ఆళ్వార్, భూతత్తి ఆళ్వార్, పేయాళ్వార్ మరియు నమ్మాళ్వార్ కలిసి నూట ఇరవై ఎనిమిది పాశురాలు శ్రీ అళగర్ పెరుమాళ్ మీద గానం చేశారు.
చరిత్రక మరియు  పౌరాణిక పాశస్త్యం ఉన్న  మధురై పట్టణం చుట్టుపక్కల ఉన్న ఆరు దివ్య దేశాలలో ప్రముఖమైనది అళగర్ కోవెల. 
మధురై నగరంలో ఉన్న కూడల్ అళగర్ కోవెల కూడా విశేషమైనదే !
నమో నారాయణ !!!!

Sunday, December 10, 2017

pazamthottam (kanaka dhara sthothram house / Swarnattu Mana)


జగద్గురు శ్రీ శ్రీ శ్రీ శంకరాచార్య , వృద్ధ బ్రాహ్మణా స్త్రీ దారిద్యాన్ని దూరం చేయడానికి, ఆమె కుటుంబానికి శ్రీ మహాలక్ష్మి కరుణాకటాక్షాలు లభించడానికి ఆశువుగా పలికినది  "కనకధారా స్తవం". 
ప్రస్తుతం స్వర్ణత్తు మాన గా పిలవబడుతున్న ఆ గృహం కేరళ లోని అల్వా కి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నది. 
ముంబైకి చెందిన కొందరు ఒక ట్రస్ట్ ఏర్పాటు చేసి నలుగురికీ ఈ ఇంటి గురించి తెలుపాలన్న సదుద్దేశ్యంతో చేస్త్తున్న ప్రయత్నం లో భాగమే ఈ కరపత్రం. 
గత నెలలో నేను ఈ గృహాన్ని సందర్శించినప్పుడు ట్రస్ట్ వారితో పరిచయం కలిగింది. 
ఇంటిని గురించిన వివరాలను అన్ని భాషలలో ప్రచురించిన కరపత్రాన్ని నాకు పంపారు. తెలుగు లో రచించిన దానిలో కొంత భాగాన్ని అందించడం జరిగింది. 
ఆ వివరాలు అందరితో పంచుకొనే ప్రయత్నమే ఇది.   
పళం తొట్టం ఎలా చేరుకోవాలి అన్న వివరాలు కూడా ఇవ్వబడినాయి.  


Sabarimala

My article on Sabarimala in today Vartha Telugu paper Sunday book.

Wednesday, December 6, 2017

Request

ఎందరో మహానుభావులు. అందరికీ వందనాలు.

శ్రీ లక్కరాజు శివరామకృష్ణ రావు, శ్రీమతి. భార్గవీ దేవి (చికాగో)దంపతుల ఆర్ధిక సహాయంతో   "అరుణాచల శివ... అరుణాచల శివ...  అరుణాచల" పుస్తకం గత జులైలో  అందరికీ అందుబాటు లోకి వచ్చింది. అరుణాచలేశ్వరుని భక్తులు, భగవాన్  శ్రీ రమణ మహర్షి భక్త బృందాలవారు, మరెందరో ఆధ్యాత్మిక మార్గాన్వేషకులు రెండో ముద్రణకు తమ వంతు ఆర్ధిక సహాయం అందించారు. దానికి కొంత మొత్తం కలిపి రెండో ముద్రణ వేయించడం జరిగింది.
రెండో సంచికలో ప్రముఖ రచయితలు, భగవాన్ శ్రీ రమణ మహర్షి భక్తులు అయిన శ్రీ. పింగళి సూరి సుందరం గారు, శ్రీ రావినూతల శ్రీ రాములు గారు కొన్ని విషయాలను జత చేయమని ఇచ్చిన సలహాల మేరకు మార్పులను చెయ్యడం జరిగింది. 
వారికీ నా హృదయ పూర్వక పాదాభివందనాలు.
ఆర్ధిక సహాయం చేసిన ఆదోని, విజయవాడ, ఒంగోలు, గుంటూరు కు చెందిన శ్రీ రమణ సత్సంగ బృందాల వారికి, హైదరాబాద్, నెల్లూరు, కడప, గుంటూరు, తెనాలి పట్టణాల భక్తులకు పేరు పేరునా కృతజ్ఞతలు తెలుపుకొంటూ వారికి  శ్రీ అణ్ణామలేశ్వర స్వామి వారి అనుగ్రహం  సంపూర్తిగా ఎల్లప్పుడూ ఉండాలని ప్రార్ధిస్తున్నాను.

ప్రస్తుతం మూడో ముద్రణకు ప్రయత్నాలు ఆరంభించాను. భక్తులను తమ వంతు సహాయం అందించమని మరో మారు అభ్యర్ధిస్తున్నాను.
మూడో ముద్రణంతో పాటు "జన్మ నక్షత్ర మరియు జన్మ రాశి ఆలయాలు" అన్న మరో పుస్తకం కూడా ముంద్రించ తలచాను. ఆ పుస్తకంలో ఆయా ఆలయాల పూర్తి విశేషాలతో పాటు ఆయా నక్షత్రాల లేదా రాశి వారు గ్రహ అనుగ్రహం కొరకు ఎలాంటి పూజలు జరిపించుకొంటే జీవితంలో ఉన్నత స్థితి చేరుకొంటారో వివరంగా తెలపడం జరుగుతుంది. వీటితో పాటు నిత్య జీవితంలో విద్య, ఉద్యోగం, వ్యాపారాభివృద్ధి, వివాహం, సంతానం, కోర్ట్ విషయాలు, ఋణ భాధలు, అనారోగ్యం, ఎలాంటి సమస్యకు ఏ ఆలయంలో ఏ పూజ జరిపించుకోవాలో  అన్న పరిహార క్షేత్రాల వివరాలు మరియు అక్షయ తృతీయ నాడు ఏ నక్షత్రం వారు బంగారం ఒకటే కాకుండా వేరే ఏమి కొనుగోలు చేస్తే వృద్ధి కలుగుతుందో అన్న వివరాలు ఇవ్వడం జరుగుతుంది.

ఈ పుస్తకాలు అందరికి ఉచితంగా ఇవ్వడానికి కారణం ఒకటే ! మన దేశంలో ఉన్న అపురూప, మహనీయ, పవిత్ర ఆలయాల గురించి అందరికీ తెలియచేయాలని, వాటిని సందర్శించి అందరూ ఆ పరమాత్ముని కరుణాకటాక్షాలు పొంది జీవితంలో అభివృద్ధి చెందాలన్నదే !
ఈ మహా కార్యక్రమంలో పాల్గొని తమ వంతు సహకారం అందించాలని ఈ బ్లాగ్ చదివేవారికి  శిరస్సు వంచి విన్నవించుకొంటున్నాను. మీరు పంపే ప్రతి ఒక్క రూపాయీ పదిమందిని  భగవంతుని కృపకు పాత్రులను చేసి, అలా లభించే మానసిక ధైర్యంతో   జీవితంలో ఎదురయ్యే సమస్యల నుండి బయట పడవేయడానికి ఉపయోగపడుతుంది.
 ఆ పుణ్యఫలం మీదే  !!!
ఆర్ధిక సహాయం ఈ క్రింది బ్యాంకు అకౌంట్ నెంబర్ కి పంపగలరు.

I.J.Venkateshwerlu,  ICICI Bank, M G Road branch, Vijayawada.
A/c. no.630601522726. IFSC code. ICIC0006306.


 సర్వేజనా సుఖినో భవంతు !!!!

ఇలపావులూరి జనార్దన వెంకటేశ్వర్లు,
విజయవాడ
9052944448