1, అక్టోబర్ 2015, గురువారం

Arunagirinather

                                             అరుణగిరినాథర్ 




తిరువన్నామలైయార్ ఆలయంలో రాజ గోపురం, తిరుమంజన గోపురం, పై గోపురం, అమ్మనిఅమ్మన్ గోపురం, వల్లాల రాజు గోపురం, కిళ్ళీ గోపురం ఇలా ఎన్నో గోపురాలున్నాయి.

ప్రతి గోపురం వెనుక ఒక పురాణ లేదా చారిత్రక గాధ ముడిపడి ఉండి, అరుణాచలేశ్వరుని పట్ల భక్తులకు గల అవాజ్యభక్తి భావాన్ని తెలియజేస్తాయి. 

వీటిల్లో కిళ్ళి గోపురం వెనుక గల గాధ పరమేశ్వర పుత్రుడైన శ్రీ సుబ్రహ్మణ్య స్వామి తోనూ ఆయన ప్రియ భక్తుడు శ్రీ అరుణగిరినాథర్ తోనూ ముడిపడి ఉన్నది.

అరుణాచలేశ్వరుని మహిమల గురించి, భక్తవాత్సల్యత గురించి ఎందరో కవులు కీర్తనలు రచించి గానం చేసారు.

అరుణగిరినాథర్ కూడా ఒక కీర్తనాకారుడే ! కానీ ఆ మధుర గీతాల సృష్టి అంతా కుమార స్వామి కృపాకటాక్షాలతో సాధ్యపడినది అన్నది ఆయనే స్వయంగా పేర్కొన్నారు.     



"తోండరదిప్పొడి ఆళ్వార్" గా ప్రసిద్దుడైన "విప్ర నారాయణ' చరిత్ర అందరికీ తెలిసినదే !

ఆయన జీవితంలో జరిగిన సంఘటనలకు, అరుణగిరినాథర్ జీవితంలో చోటుచేసుకొన్న కొన్ని ఘటనలకు పోలికలు ఉండటాన్నిగమనిస్తే,లీలారూపుడైన భగవంతుడు తన భక్తులను ఎలా అక్కున చేర్చుకొంటారో అవగతమవుతుంది.  

సంప్రదాయ బ్రహ్మణ కుటుంబంలో తిరువన్నామలైలో జన్మించారు అరుణగిరినాథర్. తండ్రి గొప్ప సుబ్రహ్మణ్య స్వామి భక్తులు మరియు కవి పండితుడు. 

సకల విద్యలనూ అభ్యసించారు. చిన్నతనం నుండి తన ఆరాధ్య దైవము అయిన శ్రీ షణ్ముఖ స్వామి మహిమల గురించి  చక్కని కవితలను రచించి గానం చేసేవారు. నిష్టగా శ్రీ కుమార స్వామి ధ్యానం, ఉపాసన చేసేవారు. 

యవ్వనం లోనికి అడుగు పెట్టిన అరుణగిరినాథర్ ఆలోచనలు మరియు అలవాట్లు పక్క త్రోవ పట్టాయి. 

అందమైన, అనుకూలవతి అయిన  భార్య ఉన్నా వారకాంతల వ్యామోహంలో పడిపోయారు. 

సంసార భాద్యతలను పూర్తిగా విస్మరించి సదా వెలయాలుల ఇండ్లలో ఉంటుండే వారు. 

సోదరుని పట్ల గల అవాజ్యవాత్సల్యంతో సోదరి అతని కుటుంబ ఆలనాపాలన చూడటమే కాకుండా అతని 

వ్యసనాలకు కావలసి ధనాన్ని కూడా ఇస్తుండేది. 



కొంతకాలానికి అరుణగిరి నాథర్ని ఆరోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. చేతిలో డబ్బులు లేకుండా పోయాయి.

వేశ్యలు వెళ్ళగొట్టారు. నగర ప్రజలు నిరసనగా చూడసాగారు. 

వ్యామోహానాన్ధకారం లో పూర్తిగా తల మునకలుగా ఉన్న అరుణగిరినాథర్ కు ఈ విషయాలేవీ పట్టలేదు. అతనికి కావలసినది సుఖం దానిని పొందటానికి ధనం. అంతే !

అక్క దగ్గరికి వెళ్లి ధనం కావాలని అడిగారు. అప్పటికి ఆస్తులు అన్నీహరించుకు పోవడంతో దారిద్ర స్థితికి చేరుకొన్న ఆమె కనీసం ఇప్పుడైనా తోడబుట్టిన వానిని దారి లోనికి  తేవాలని " నా దగ్గర ధనం లేదు.  నీకు అంతగా స్త్రీ సుఖం కావాలంటే నా శరీరం ఉన్నది." అని పలికింది. 

అంతే సిగ్గుతో అక్కడ నుండి వెళ్లి పోయి ఈ నిరర్ధకమైన జన్మ వృధా !అని తలంచి ఆలయ గోపురం నుండి దూకి ఆత్మహత్య చేసుకోవాలని తలంచారు. 


దూకిన ఆయన క్షేమంగా తన ఇష్ట దైవమైన మయూర వాహనుని దివ్య హస్తాలలో వ్రాలాడు. దివ్య స్పర్శ తో వ్యాదులన్నీ మటుమాయం అయ్యాయి.


నూతన జన్మ ఎత్తిన అనుభూతి కలిగింది. తనను కాపాడిన పార్వతీ నందనుని మధురమైన కీర్తనలతో స్తుతించారు. 

శరవణభవహరుడు ఆశీర్వదించి నిత్యం తనకు ఇలాగే కీర్తనాభిషేకం చేయమని తెలిపి అంతర్దానమైయ్యారు. 

నాటి నుండి నిరంతరము స్వామి ధ్యానంలో ఉంటూ సుమారు పదహారు వేల పై చిలుకు కీర్తనలను రచించారు. 


వాటిల్లో నేడు పదమూడు వందలు మాత్రమే అందుబాటులో ఉన్నాయి. 


ఎన్నో క్షేత్రాలు సందర్శించి చివరికి తిరిగి తిరువన్నామలై చేరుకొన్నారు. 


అరుణగిరినాథర్ భక్తి ప్రపత్తుల మరియు కీర్తనల గురించి తెలుసుకొన్న ఆ ప్రాంత పాలకుడైన "ప్రౌఢ దేవరాయలు" స్వయంగా తరలివచ్చి, సగౌరవంగా రాజ భవనానికి తోడ్కొని వెళ్ళారు. 


వెయ్యి కాళ్ళ మండపం 

అప్పటికి ఆయన కొలువులో "సంబందందన్" అనే గొప్ప పండితుడు ఉండేవాడు. సకల శాస్త్ర కోవిదుడు.

ఎప్పుడు పిలిస్తే అప్పుడు కాళీ మాత దర్శనం పొందగలిగిన వరం పొందిన  ఉపాసకుడు.  కాకపోతే అహంకారి, ఇహలోక సుఖాల పట్ల, అధికారం పట్ల యెనలేని వ్యామోహం గలవాడు. రాజు అరుణగిరినాథర్ కు ఇస్తున్న గౌరవాన్ని చూసి, తన స్థానానికి ఎక్కడ ముప్పు వస్తుందోనని భయపడసాగాడు. 

అప్పటికే ప్రాపంచిక విషయాల పట్ల ఆకర్షణల పట్ల పూర్తిగా విముఖుడైన అరుణగిరినాథర్ సదా స్వామి సేవలో నిమగ్నమై ఉండేవారు. 

అయినా స్తిమితపడని  సంబందందన్ ఎలాగోలా అరుణగిరి నాథర్ ను రాజ్యం నుండి పంపివేయాలని ప్రణాళిక రచించాడు. 

దాని ప్రకారం రాజును మభ్యపెట్టి వారిద్దరి మధ్య పోటికి ఒప్పుకోనేలా చేసారు. 

పోటీ లోని ముఖ్య మైన అంశం ఏమిటంటే ఇరువురూ తమతమ ఇష్టదైవాల సాక్షాత్కారం పొందినవారే కనుక తమ గానం తో మరో మారు దేవతలను సంతృప్తి పరచి వారి దర్శన భాగ్యం మహారాజుకు, ఇతర నగర ప్రముఖులకు కలిగించాలి. 

తనకున్న వరగర్వంతో ఈ పోటీని ఏర్పాటు చేసిన  సంబందందన్ నిరాశ ఎదురయ్యింది. ఎంత కీర్తించినా ప్రార్ధించినా కాళీ మాత ప్రసన్నం కాలేదు దర్శనం ఇవ్వలేదు. 

సంబందందన్ కు పోటీకి పిలుపిచ్చిన తరువాత గుర్తుకోచ్చినది అమ్మవారు తనకు దర్శన భాగ్యం అనుగ్రహించిన పుష్కర కాలం నిన్నటితో ముగిసి పోయింది అని !

అయినా ప్రయత్నించాడు. చివరకు ఆ తల్లిని తన కుమారుని ఆపి అయినా తనకు పరాజ భారం కలగకుండా చేయమని ప్రార్ధించాడు. అదీ విఫలమైనది.   

ఈ కుట్రలు కుతంత్రాలు తెలియని అరుణగిరినాథర్ దండాయుధ పాణిని కీర్తిస్తూ గానం చేసారు. "అతలసదా నారద " అనే కీర్తన పాడేటప్పటికి పెద్ద పెద్ద ఉరుములు  మెరుపుల శబ్దాలు వెలుగుల మధ్య ఒక స్తంభము మీద శ్రీ స్వామినాధుడు సాక్షాత్కరించారు. 
అద్భుత కాంతులకు ప్రౌఢ దేవరాయలు తన కంటి చూపును కోల్పోయాడు. 

వేలాయుధ స్వామి కరుణించినా సంబందందన్ లో మార్పు రాలేదు.  రాయలు నేత్ర దృష్టిని కోల్పోవడంతో పోటీ అర్ధాంతరంగా ముగిసి పోవడంతో రాజ్యం విడిచిపెట్టి పోవలసిన నిబంధన నుండి తప్పించుకొన్న ఆయన మరో కుట్రకు రూపకల్పన చేసాడు.  






ఇంద్ర లోకంలో ఉండే "పారిజాత పుష్పం" తాకిస్తే పోయిన చూపు తిరిగి వస్తుందని, ఆ పుష్పాన్ని తీసుకురా గలవాడు ఒక్క అరుణగిరి నాథర్ అని రాజుకు వైద్యుల చేత చెప్పించాడు. 

తన మూలంగా మహా రాజు దృష్టి పోగొట్టుకొన్నాడు అన్న బాధతో ఉన్న అరుణగిరినాథర్ ఈ విషయం వినగానే ఇంద్ర లోకం వెళ్ళడానికి తన సంసిద్దత  తెలిపాడు. 

అరుణాచలేశ్వరుని, బాల సుబ్రహ్మణ్యాన్ని ప్రార్ధించి, పరకాయ ప్రవేశ విద్యతో మరణించిన చిలక శరీరం లోనికి ప్రవేశించి ఊర్ధ్వ లోకాలకు వెళ్ళాడు. 

కొంత కాలం గడిచింది. అరుణగిరి నాథర్ తిరిగి రాలేదు. తన తంత్రాన్ని ప్రయోగించి అరుణగిరి నాథర్ శరీరాన్ని అగ్నికి ఆహుతి చేసేలా చేసాడు  సంబందందన్. 

ఒకనాడు పారిజాత పుష్పాన్ని ముక్కున కరుచుకొని చిలక రూపములో అరుణగిరి నాథర్ మహారాజు ముందు వాలారు. 


పుష్ప ప్రభావంతో ప్రౌఢ దేవరాయలకు తిరిగి చూపు లభించినది. 

తమ తప్పిదనానికి క్షమించమని వేడుకోన్నవారిని ఆశీర్వదించి, తనకు ఇహలోక బంధాల నుండి విముక్తి లభించినందుకు ఆనంద పడుతూ అరుణగిరి నాథర్ అన్నామలై ఆలయ ప్రాంగణం లోని మూడో ప్రాకారం లోనికి వెళ్ళే గోపురం మీద నివాసమేర్పరచుకొన్నారు. 

ఈ కారణంగా ఈ గోపురాన్ని "కిళ్ళీ (చిలక) గోపురం" అని పిలుస్తారు. 

ఈ గాయక భక్తుని స్మృతి చిహ్నంగా గోపురం మధ్యలో, పైభాగాన చిలక బొమ్మను ఉంచారు. 




తూర్పున ఉన్న రాజ గోపురం గుండా ప్రాంగణం లోనికి ప్రవేశిసిస్తే  మన ఎడమ వైపున కనిపిస్తుంది "కంబత్తి  ఇలయనార్" (స్తంభంలో కనిపించినవాడు )గా పిలిచే శ్రీ సుబ్రహ్మణ్య స్వామి సన్నిధి. ఈ ప్రదేశం లోనే స్వామి అరుణగిరి నాథర్ గానానికి పరవశించి సాక్షాత్కరించినది అని చెబుతారు. 

ఆలయ మండప పైభాగాన అరుణగిరినాథర్ ను అనుగ్రహిస్తున్న ఈశ్వర సుతుని చక్కని విగ్రహాలను నెలకొల్పారు. 

సుందర దేవీ దేవతల, పురాణ ఘట్టాల, సూక్ష్మ చెక్కడాలు ఆలయమంత చెక్కారు. 

ఒకప్పుడు ప్రాంగణం లో తొలి ఆలయం అయిన "గోపుర గణపతి " సన్నిధి దీని వెనక ఉంటుంది. దక్షిణాన శివగంగ తీర్ధం, ఉత్తరాన శ్రీ కృష్ణ దేవరాయల నిర్మితమైన వెయ్యి స్తంభాల మండపం ఉంటాయి. 

రెండో ప్రాకారం లో గల బ్రహ్మ తీర్ధము గోడ పైన ధ్యానం లో ఉన్న శ్రీ అరుణగిరి నాథర్ మూర్తిని చూడ వచ్చును. 

ఆలయ గజరాణి "రుక్కు" ను ఉంచే మండపం వెనుక !






గోపుర గణపతి సన్నిధి 



ప్రతి సంవత్సరం ఆగష్టు పదునాలుగు నుండి పదహారో తారీఖు వరకూ మూడు రోజుల పాటు "అరుణగిరినాథర్ విళ"పేరుతో ఉత్సవాలు తిరువన్నామలై ఆలయంలో నిర్వహిస్తారు. రాష్ట్ర నలుమూలల నుండి విద్వాంసులు, గాయకులూ, వ్యాయిద్యకారులో, నాట్య విద్యా విశారదులు తరలి వచ్చి తమ విద్యనూ ప్రదర్శించి అరుణగిరి నాథర్ పట్ల తమకు  గల గురు భావాన్ని, గౌరవాన్ని చాటుకొంటారు. 

ఓం అరుణాచలేశ్వరాయ నమః !!!!

  

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...