1, సెప్టెంబర్ 2015, మంగళవారం

Pavala kundru

  శ్రీ అర్ధనారీశ్వర ఆలయం, పావలకుండ్రు, తిరువణ్ణామలై  

తిరువణ్ణామలై, అరుణాచలం, అరుణగిరి ఇలా పేరేదైనా స్మరించినంతనే సర్వ పాపాలను తొలగించి కైలాసవాసాన్నిప్రసాదించే దివ్య క్షేత్రం. 
ఈ పవిత్ర క్షేత్రంలో ఎన్నో పురాతన, చారిత్రిక ప్రాముఖ్యత కలిగిన ఆలయాలు, వివిధ సంస్థల, సాధు సంతుల ఆధ్వర్యంలో నెలకొల్పబడిన నూతన ఆలయాలు కలవు. 




అలాంటి వాటిల్లో "పావల కుండ్రు" (coral hill, పగడపు కొండ) మీద ఉన్న శ్రీ అర్ధనారీశ్వర స్వామి ఆలయం ఒకటి. ఈ పర్వతానికి అరుణాచల పురాణంలో ప్రత్యేక స్థానం కలదు. 
ఈ ఆలయానికి సంబంధించిన పురాణ గాధ ఇలా ఉన్నది. 










 ఒకనాడు కైలాసంలో ఆదిదంపతులు ఇష్టోక్తులు సలుపుతున్న సమయంలో సరదాగా అమ్మవారు స్వామి వారి కన్నులు రెండూ తన చేతులతో క్షణకాలం మూసివేసారట.  లోకాలకు వెలుగును ప్రసాదించే సూర్య చంద్రులను కప్పివేయడంతో సమస్త లోకాలలో చీకటి అలముకొని అల్లకల్లోలమై పోయాయట. దేవతలు, మునులు, సామాన్య మానవులు ఇలా ప్రతి ఒక్కరూ ఏమి జరుగుతోందో తెలియక భయాందోళనలకు గురైనారట. దిక్కుతోచక వారు పరమేశ్వరుని ప్రార్ధించారట. 
ఈలోగా ముక్కంటి మృదువుగా అమ్మవారి చేతులను తొలగించారట. అప్పటికే అంధకార ఉపద్రవం ముల్లోకాలను ముంచెత్తినదట. విషయం అర్ధం కాని పార్వతీ దేవికి ఆమె తన కనులను మూయడం వలన జరిగిన అనర్ధం తెలిపారట మహేశ్వరుడు. 
ఆమె తన చిలిపి చేష్ట వలన నెలకొన్న విపత్తుకు బాధపడి భక్తవత్సలుని క్షమాపణ కోరిందట. 





తెలియక చేసినా తప్పు తప్పే గనుక సర్వేశ్వరుడు సతీ దేవిని కైలాసం వీడి భూలోకంలో  ప్రాయఃచిత్తం చేసుకోమని చెప్పారట. తొలుత పార్వతీ దేవి కాంచీపురం చేరుకొని సైకత లింగాన్ని ఏర్పాటు చేసుకొని చాలాకాలం తపస్సు చేసిందట. అనంతరం సదాశివుని సందేశం మేరకు తిరువణ్ణామలై చేరుకొన్నారట.  
ఆది దేవి అరుణాచలం తరలి వచ్చి ఈ ఎఱ్ఱని పర్వతం (పగడపు కొండ) మీద తీవ్ర తపస్సు చేసారట. 
ఆమె దీక్షను సంతసించిన భక్త మందారుడు సాక్షాత్కరించి తనలో అర్ధభాగంగా ఉండమని కోరినదిక్కడే అని అంటారు. 
ఈ కారణంగా ఇక్కడి స్వామిని శ్రీ అర్ధనారీశ్వరుడు అని పిలుస్తారు. 


 




తిరువణ్ణామలై బస్సు స్టాండ్ నుండి అణ్ణామలై స్వామి ఆలయానికి వెళ్ళే దారిలో పావల కుండ్రు వీధి లోనికి వెళితే చివర ఉన్న సోపాన మార్గం కొండ మీదకి చేరుస్తుంది. 
మార్గ మధ్యలో తల లేని నంది, పై కప్పు లేని వినాయక విగ్రహాలు కనిపిస్తాయి. మెట్ల మార్గానికి ఇరు పక్కలా బిల్వ వృక్షాలు లెక్కకు మిక్కిలిగా ఉంటాయి. 
వాటి మధ్యలో చిన్నరాతి మీద ఒక పురాతన నంది మండపం ఉంటుంది. 
దాని క్రిందనే ఉన్న చిన్న మండపంలో పెద్ద రాతి మీద శ్రీ గణేష, శ్రీ సుబ్రహ్మణ్య, శ్రీ వీర భద్ర సమేత శ్రీ పార్వతీ పమేశ్వరుల రూపాలు చెక్కి కనిపిస్తాయి. 





ప్రధాన ఆలయానికి కొద్దిగా దిగువన సహజంగా ఏర్పడిన పుష్కరణి ఉంటుంది. 
అక్కడి నుండి తిరువణ్ణామలై పట్టణాన్ని సంపూర్ణంగా ఒక విహంగ వీక్షణం చేయవచ్చును. 






అగ్ర భాగానికి చేరుకొంటే ముందు నంది మండపం, ఆలయ ముఖ మండపం కనిపిస్తాయి.
ఈ పౌరాణిక ప్రాశస్త్యం కలిగిన ఆలయం చరిత్రలో కూడా సుస్థిర స్థానాన్ని ఏర్పాటు చేసుకొన్నది.
మైసూరు పాలకుడైన టిప్పు సుల్తాన్ తిరువణ్ణామలై  మీదకు 1790వ సంవత్సరంలో దండ యాత్ర చేసి స్వాధీనపరుచుకొని, ప్రజలను హింసించి, అనేక కట్టడాలను నేలకూల్చాడట.
వాటిల్లో పావలా కుండ్రు ఆలయం ఒకటి.
ఎన్నో నిర్మాణాలను నేలకూల్చిన టిప్పు శ్రీ అణ్ణామలై స్వామి ఆలయం మీదకు పోక పోవడం చెప్పుకోవాల్సిన విషయం.




అప్పుడు శిధిలమైన ఆలయాన్ని 2004వ సంవత్సరంలో శ్రీ రమణ మహర్షి ఆశ్రమం వారు పునర్నిర్మించారు.
ఎందుకంటే 1899వ సంవత్సరంలో శ్రీ రమణులు కొంత కాలం ఇక్కడ నివసించారు. ఆయన లోకానికి తన తోలి సందేశం ఇచ్చిన స్థలమిదే !
ఆయనను ఇంటికి తీసుకొని వెళదామని వచ్చిన తల్లి అళగమ్మాల్ కు ఒక కాగితం మీద ఈ క్రింది వాక్యాలను రాసి చూపించారట. ఎంతో  గొప్ప జీవిత సత్యాన్ని తెలిపే ఆ వాక్యం చదివిన ఆమె ఆయనను మార్చే ప్రయత్నం వదలి తిరిగి మదురై వెళ్లి పోయారు.





“In accordance with the prarabdha of each, the One whose function it is to ordain makes each to act. What will not happen will never happen, whatever effort one may put forth. And what will happen will not fail to happen, however much one may seek to prevent it. This is certain. The part of wisdom therefore is to stay quiet.” 

( మనిషి జీవితంలో అన్నీ ప్రారబ్ధం ప్రకారమే జరుగుతాయి. ఏది జరగాలో అదే జరుగుతుంది. దానిని ఆపాలని ప్రయత్నించినా ఆగదు. అందువలన దీనిని అర్ధం చేసుకొని జ్ఞానం తో ముందుకు సాగడమే మానవ ధర్మం )
  



ఈ రెండు ఆలయ విశేషాల వివరాలు తెలిపే బోర్డులను మండపంలో ఉంచారు. 
స్తంభాల పైన దేవీ దేవతల, మహర్షుల రూపాలను చెక్కారు. 
మండపం ద్వారానికి ఇరుపక్కలా శ్రీ విఘ్న వినాయక, శ్రీ వల్లీ దేవసేనా సమేత శ్రీ సుబ్రహ్మణ్య స్వామి ఉపాలయాలుంటాయి  













గర్భాలయంలో శ్రీ అర్ధనారీశ్వర స్వామి అద్భుత అలంకరణలో లింగ రూపంలో దర్శనమిస్తారు. 
ఈ పావల కుండ్రు నుండి అరుణ గిరి తన సంపూర్ణ దర్శనాన్ని ప్రసాదిస్తుంది. 
నిత్యం ఉదయం సాయంత్రం నియమంగా పూజలు జరుపుతారు. తిరువణ్ణామలై లో జరిగే ప్రతి ఉత్సవ సమయంలో పావల కుండ్రు ఆలయంలో కూడా పండగ వాతావరణం నెలకొంటుంది. 






పునాదులు లేకుండా కొండ రాతి మీద నిర్మించిన ఈ ఆలయం నాటి నిర్మాణ చాతుర్యానికి నిదర్శనంగా చెప్పుకోవచ్చును.
స్కంద ఆశ్రమానికి వెళ్ళే దారిలో నుండి చూస్తే దూరానికి పావల కుండ్రు ఆలయం అత్యంత సుందరంగా కనపడుతుంది.
నగర నడి బొడ్డున ఉన్నా అత్యంత ప్రశాంత వాతావరణానికి నెలవు పావల కుండ్రు శ్రీ అర్ధనారీశ్వర స్వామి ఆలయం.




ఓం అరుణాచలేశ్వరాయ నమః !!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...