29, ఆగస్టు 2015, శనివారం

Kannappa Nayanar Temple, Tiruvannamalai

       శ్రీ కన్నప్ప నయనార్ ఆలయం, తిరువన్నామలై 



తిన్నడు అంటే ఎవరు ? అని అడగవచ్చు ! అదే భక్త కన్నప్ప అని అంటే తెలియని వారు ఉండరు. భక్త కన్నప్ప కధ అందరికీ తెలిసినదే! 
ప్రసిద్ద శైవ క్షేత్రం శ్రీ కాళహస్తి. పంచ భూత క్షేత్రాలలో వాయు లింగ రూపంలో సదాశివుడు కొలువై ఉన్న పవిత్ర ప్రదేశం. శివ సేవలో తలెత్తిన విభేదాలతో సాలీడు, సర్పము మరియు గజము లయకారుని సన్నిధిలో కన్నుమూసి, శాశ్వత కైలాసవాస వరాన్ని పొందాయి. వాటి మూడింటి పేర్లతోనే ఈ క్షేత్రానికి శ్రీ కాళహస్తి అన్న పేరు వచ్చింది.  అంతటి దివ్య క్షేత్రంతో ముడిపడి ఉన్న పరమ భక్తాగ్రేశ్వరుడు తిన్నడు. తన భక్తుని పరీక్షించడానికి పరమ శివుడు పెట్టిన పరీక్షలో తన కన్నులను కపర్ధికి సమర్పించుకొన్న   అచంచల భక్తి విశ్వాసాలు తిన్నని సొంతం. స్వయంగా సర్వేశ్వరుడే అతని భక్తికి మెచ్చి "కన్నప్ప" అని నామకరణం చేసారు. 



శ్రీ దండాయుధ పాణి ఆలయం 

నిత్యానంద ఆశ్రమం 

శ్రీ రాజ రాజేశ్వరీ అమ్మవారి ఆలయం 

శ్రీ కాళహస్తి ఆలయ చరిత్రతో విడదీయని బంధం ఏర్పరచుకొన్న కన్నప్ప , గాయక భక్తులైన అరవై  మూడు మంది నయమ్మారులలొ ఒకనిగా శాశ్విత కీర్తి పొందాడు. తమిళ గ్రంధాలలో "కన్నప్ప నయనార్ లేదా నేత్రేశ నయనార్" గా పిలవబడే ఈయనకి రెండు ఆలయాలు ఉన్నాయి.
ఒకటి తిన్ననికి శాశ్విత కైలాసవాసం కల్పించిన శ్రీ కాళహస్తిలో చిన్న కొండ మీద ( శ్రీ కాళ హస్తీశ్వరుని ఆలయం లో ఒక చోట నుండి కొండ మీద ఉన్న భక్త కన్నప్ప ఆలయాన్ని చూడవచ్చును), రెండవది పంచ భూత స్థలాలలో అగ్ని క్షేత్రం అయిన తిరువన్నామలై లో ఉన్నాయి.





తిరువణ్ణామలై  గిరివలయంలో ఉన్న ఈ ఆలయం చాలా పురాతనమైనది. ఎవరు ఎప్పుడు కట్టించారో అన్న వివరాలు అందుబాటులో లేవు. కాకపోతే కొంత మేర శిధలమైన పాత ఆలయాన్ని పునః నిర్మించారు. కొన్ని పురాతన తమిళ శాసనాలు కూడా కనపడతాయి ఆలయ గోడలమీద.





గిరివలయంలో వచ్చే నిత్యానంద ఆశ్రమం పక్కన అడవిలో ఉంటుందీ ఆలయం.
గతంలో అనుమతితో వెళ్ళడానికి అవకాశం ఉన్న అంతర  గిరివలయ మార్గంలో ఉంటుంది  ఈ ఆలయం. ప్రస్తుత వెలుపలి  గిరివలయం నుండి కూడా నిత్యానంద ఆశ్రమ ప్రహరీ గోడ  పక్కగుండా వెళితే చిన్న కొండ రాయి మీద ఉంటుంది.
మరో గుర్తు ఏమిటంటే మనకు ఎడమ పక్కన శ్రీ దండాయుధ పాణి మరియు శ్రీ రాజ రాజేశ్వరీ అమ్మవారి దేవాలయాలుంటాయి. ఎదురుగా రహదారికి అటుపక్కన ఉన్న కంచె దాటి అడవి మార్గంలో అర కిలోమీటరు నడిస్తే వస్తుందీ ఆలయం. 
కానీ ప్రస్తుతం కాపలా పటిష్టం చేశారు. ఎవరూ ప్రవేశించడానికి వీలు లేకుండా బలమైన కంచె ఏర్పాటు చేశారు అటవీ అధికారులు.   











చిన్న మండపం  మరియు గర్భాలయం తో ఉన్న పై భాగానికి చేరుకోడానికి సోపాన మార్గం కలదు. మండప స్థంభాల మీద ఎలాంటి చెక్కడాలు కనపడవు. ఆలయం కుడి పక్కన ఉన్న కొండ రాతి మీద ఒక తమిళ భాషలో చెక్కిన శాసనం కనిపిస్తుంది. ఎడమ పక్కన ఉన్న రాతి మీద గుండ్రంగా ఉన్న ఒక గుర్తు చెక్కి ఉంటుంది. అదేమిటో దాని అర్ధం ఏమిటో తెలియరాలేదు.ప్రశాంత ప్రకృతిలో, దట్టమైన అడవిలో ఆహ్లాదకర వాతావరణంలో  ఉన్న ఈ ఆలయం మనస్సుకు ఎంతో శాంతిని ప్రసాదిస్తుంది.గర్భాలయంలో స్థానక భంగిమలో పులి చర్మం ధరించి, ధనుర్భానాలు పట్టుకొని విగ్రహ రూపంలో శ్రీ కన్నప్ప నయనారు దర్శనమిస్తారు.













నిత్య పూజలు జరిగే ఈ ఆలయంలో భక్తుల సంఖ్య దాదాపుగా ఉండదు. ఎందుకంటే ఈ అరుదైన ఆలయం గురించి సామాన్య భక్తులకు తెలిసింది దాదాపుగా ఏమీ లేదు. పౌర్ణమి రోజులలో, కార్తీక మాసంలో, కన్నప్ప నయనారు జన్మ దిన ఉత్సవాలలో కొంత మేర భక్తుల సందడి కనిపిస్తుందని అక్కడ ఉండే సాధువులు తెలిపారు.  









గిరివలయం చేసే భక్తులు సందర్శించలేనిది శ్రీ కన్నప్ప నయనారు ఆలయం. రక్షిత అటవీ ప్రదేశంలో ఉండటం వలన అనుమతి లేకుండా లోపలికి వెళ్ళలేరు ఎవరు. అనుమతి లభించడం అంత సులభం కాదు. 

ఓం అరుణాచలేశ్వరాయ నమః !!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...