20, మార్చి 2015, శుక్రవారం

Sri Nidanampati Sri Lakshmi Ammavari Temple, Adigoppala

                 శ్రీ నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారి ఆలయం, అడిగొప్పల 

అమ్మలగన్న అమ్మ లోకపావని శ్రీ పార్వతీ దేవి దేశం నలుమూలలా ఎన్నో పేర్లతో వివిధ క్షేత్రాలలో కొలువు తీరి భక్తుల సేవలను అందుకొంటున్నారు.
అలాంటిదే "నిదానంపాడు అగ్రహారం".
నేడు గ్రామం లేకున్నాపొలాల మధ్య అమ్మవారు స్థిర నివాసం ఏర్పరచుకొని దశాబ్దాలుగా నమ్మిన వారిని అనుగ్రహిస్తున్నారు.  
ముగురమ్మల మూలపుటమ్మ ఇక్కడ పదకొండు సంవత్సరాల బాలిక రూపంలో దర్శనమివ్వడానికి సంబంధించిన గాధ తాలూకు ఆరంభం యుగాల క్రిందటిదిగా తెలుస్తోంది. చివరికి కలియుగంలో అమ్మవారు ప్రకటితమవ్వడంతో ముగిసింది అని భావించవచ్చును.
ఒకనాడు కైలాసంలో నటరాజు ఆనంద తాండవం చేస్తుండగా ప్రమధ గణాలు కూడా ఆయనతో నర్తించ సాగారట. 
ఆ అపురూప సందర్భంలో నంది కూడా తనకు తెలిసిన విధంగా నృత్యం చేయసాగాడట. 
అది చూసి పార్వతీ దేవి పగలబడి నవ్వసాగారట. 
అక్కడే ఉన్న నంది తండ్రి "శిలాద మహర్షి" ఆగ్రహించి, "భక్తి భావంతో నర్తిస్తున్న నా కుమారుని తల్లిలా ఆదరించకుండా రూపం చూసి పరిహసించిన నీవు కలియుగంలో భూలోకంలో జన్మించి, ఈ ఎద్దు మూలంగా నీ వారి చేతనే అనుమానించబడి, అవమానించబడెదవు" అని  తీవ్రంగా శపించారట.    

 శాప కారణంగా కలికాలంలో దేవి నిదానంపాటి అగ్రహారంలో యాగంటి రామయ్య, సుగుణమ్మ దంపతులకు బిడ్డగా జన్మించినది. ఆమెకు శ్రీ లక్ష్మి అని నామకరణం చేసారు.
ఆమెకు మూర్తయ్య, వెంకయ్య, నరసయ్య మరియు లింగయ్య అనే నలుగురు అన్నలు.
అందరి ప్రేమాభిమానాలతో పెరిగి పదకొండు సంవత్సరాలదైనది.
రామయ్య కు విశేష పశు సంపద ఉండేది.
వాటిల్లో కామధేనువు అని పిలిచే చక్కని గోవు ఉండేది.
ఎలా అలవాటు అయ్యిందో తెలియదు శ్రీ లక్ష్మి కి గోపంచకం తాగటం అలవాటయ్యింది.
అది కూడా కామధేనువు వద్దనే !
ప్రతి నిత్యం ఉదయాన్నే గోపంచికం సేవించిన తరువాతనే మిగిలిన పనులకు వెళ్ళేది చిన్నారి శ్రీ లక్ష్మి.
ఒకనాడు మదించిన ఆంబోతు ఒకటి పశువుల కొష్టం లోనికి ప్రవేశించి కట్టేసి ఉన్న ఆవును దాటి వెల్లిపోయినదట.
ఇది జరిగిన కాసేపటికి విషయం తెలియని శ్రీ లక్ష్మి గోవు దగ్గరికి వెళ్లి పంచకం స్వీకరించినది.
దాని ద్వారా ఆంబోతు వీర్య కణాలు ఆమె గర్భం లోనికి ప్రవేశించాయి.
తనలో శారీరకంగా వస్తున్న మార్పులు రజస్వల కాని శ్రీ లక్ష్మికి తెలియకున్నాతల్లి తండ్రులకు, అన్నలకు, ఊరి వారికి తెలిసిపోయినది.


ఊరి వారు పలుపలు విధములుగా మాట్లాడసాగారు.
తల్లితండ్రులు వారికి రజస్వల కాని ఆడపిల్ల గర్భవతి ఎలా కాగలదు ? అని ప్రశ్నించి తమ బిడ్డ ఎలాంటి తప్పు చేయలేదు అన్న పరిపూర్ణ నమ్మకం కలిగి ఉన్నారు.
కానీ మొదటి ముగ్గురు అన్నలూ,  చెల్లెలి కారణంగా తమ కుటుంబానికి, వంశానికి మాయని మచ్చ ఏర్పడినది అని భావించి ఆమెను అంతం చేయడానికి నిర్ణయించు కొన్నారు.


ఒకనాడు అన్నలు శ్రీ లక్ష్మి కి తాము ప్రత్తి చేనుకు వెళుతున్నాము మధ్యాహాన్నం భోజనం తెమ్మని చెప్పారు.
చిన్నవాడైన లింగయ్య అన్నలు చెల్లెలికి హాని కలిగించాబోతున్నారు అని అనుమానించాడు.
అతను తమకు అడ్డుపడతాడని తాగటానికి మంచి నీరు తెమ్మని పంపారు.
భోజనం తీసుకొని పొలానికి బయలుదేరిన శ్రీ లక్ష్మి కామధేనువుకు నమస్కరించుకోడానికి వెళ్ళగా ఆ గోవు నిన్ను చంపడానికి నీ సోదరులు ప్రయత్నిస్తున్నారు.  పొలానికి వెళ్ళద్దు. అని చెప్పగా నవ్వి ఇంటి నుండి పొలాల గుండా వెళుతుండగా దారిలో నాగరాజు ఎదురై కామధేనువు చెప్పిన మాటలే చెప్పినది.
అయినా అన్నల మీద నమ్మకం, ప్రేమతో ముందుకే కదిలింది శ్రీ లక్ష్మి.
పొలానికి వచ్చిన చిన్నారి శ్రీ లక్ష్మిని అన్నలు పత్తి పొలంలో మంట పెట్టి దారుణంగా తగలబెట్టారు.


అగ్నికి ఆహుతి అవుతూ బాలిక నేను నిరపరాధిని అని పలుకుతుండగా ఆమె గర్భం నుండి ఒక కోడె దూడ బయటపడి మృతిచెందినది.
 నీటి కోసం వెళ్ళిన చిన్నవాడు లింగయ్య తిరిగి వచ్చి అన్నలు చేసిన ఘోరానికి వారిని నిందించి చెల్లెలిని  ధుఖించసాగాడు.
నిజం తెలుసుకొన్న అన్నలు  మూర్ఖుల మాదిరి వ్యవహరించినందుకు, తోడ బుట్టినిదానిని చంపినందుకు రోదించసాగారు.
అదే సమయంలో కోష్టం లో కట్టివేయబడిన కామధేనువు కట్టు తెంచుకొని పరుగు పరుగున వచ్చి మంటలలో పడి ఆహుతి అయ్యింది.


ఇదంతా చూస్తున్న అన్నల ముగ్గురికీ చేసిన పాపానికి ఫలితమా అన్నట్లుగా అకస్మాత్తుగా అంధత్వం సంక్రమించినది.
విషయం తెలిసి శ్రీ లక్ష్మి తల్లి తండ్రులూ గ్రామస్తులూ పొలానికి తరలివచ్చి రోదించ సాగారు.
మధ్యాహాన్నం పన్నెండు గంటలకు అగ్ని నుండి సువర్ణ శిల్ప రూపంలో వెలుపలికి వచ్చిన శ్రీ లక్ష్మి ని చూసి అందరూ నమస్కరించారు. 
ఒక పదకొండు సంవత్సరాల బాలికా మీద తన అంశను ప్రసరింపచేసినది. 
ఆ బాలిక గత వృతాంతం అంతా తెలిపి తనకు ప్రతి ఆదివారం పసుపూ కుంకుమ పూజలు చేసి పొంగలి నైవేద్యం సమర్పించిన వారికి శుభం కలుగుతుందని చెప్పినది. 
నాటి నుండి నిదానంపాటి శ్రీ లక్ష్మి అమ్మవారిగా ఈ ప్రాంతం వారు భక్తి విశ్వాసాలతో ఆమెను ఇలవేల్పుగా భావించి కొలవసాగారు. 
శ్రావణ శుక్రవారం రోజున లక్ష కుంకుమార్చన, ఫాల్గుణ పౌర్ణమి సమయంలో ప్రత్యేక ఉత్సవాలు నిర్వహిస్తారు.
నవంబర్ మరియు డిసెంబర్ నెలలో అమ్మవారి దీక్షలు భక్తులు స్వీకరిస్తారు.


నిత్య పూజలు ఇతర నిర్ణయించిన సేవలు నియమంగా జరుపుతారు.

అడిగొప్పల గ్రామానికి సమీపంలోని నిదానంపాడు కు గుంటూరు జిల్లా లోని దుర్గి నుండి సులభంగా చేరుకొనవచ్చును. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...