7, ఫిబ్రవరి 2015, శనివారం

Vidurashwatha

                                           విదురాశ్వద్ధం 

  
వృక్షాలు ఆరోగ్య ప్రదాతలు. 
వృక్షాల వలన మానవాళికి జరిగే మేలు అనిర్వచనీయమైనది. 
ఒక్కో జాతి చెట్టు ఒకో విధమైన ఔషధ గుణాలను కలిగి ఉంటుంది. పురాణాలలో  మరియు ఆయుర్వేద గ్రంధాలలో వృక్షాల ఔషద గుణాల గురించి సవివరంగా పేర్కొనబడినది.
ఈ విషయాన్ని ఆధునిక వైద్యం కూడా అంగీకరించినదే !
ఒక రకంగా చెప్పాలి అంటే సహజసిద్ధం వాతావరణంలో పెరిగే వృక్షాలు, మొక్కల  నుండి సేకరించిన మూలికలు అనగా ఆకులు, పూలు, కాండం తాలూకు బెరడు, వేరులు ఆఖరికి వాటి నుండి వీచే గాలి కూడా ఔషధ గుణాలను కలిగి ఉండటం ప్రకృతి మాత మనకు ఇచ్చిన వరం. 
ఈ విషయాన్ని ఏనాడో గ్రహించిన మన పూర్వీకులు వృక్షాలకు దైవత్వాన్ని ఆపాదించారు. కారణం వాటిని కాపాడటానికి తద్వారా మానవాళి ఆరోగ్యవంతంగా జీవించడానికి. 








దైవత్వాన్ని పొందిన వృక్షాలలో అగ్రస్థానం రావిచెట్టు దే !!! 
దక్షిణ భారత దేశం లోని అన్ని ఆలయాలలో ప్రముఖ స్థానంలో కనిపించేది "అశ్వద్ద వృక్షం"గా పిలిచే రావిచెట్టు. రెండవ స్థానం మారేడు ది. ఎన్నో ఔషధ గుణాలకు ప్రతి రూపం. 
అశ్వద్ద వృక్షం సమస్త దేవతా స్వరూపం !
శ్రీ మహా విష్ణువు తన మరో రూపంగా పేర్కొన్నందున అశ్వద్ద నారాయణు నిగా కూడా పిలుస్తారు.
మన ఆలయాలలో రావిచెట్టు వేప చెట్టు కలిసి పెరిగిన చోట వాటిని పవిత్రమైనవిగా భావించి ఆరాధించడం, సంతానం కొరకు వాటికి ప్రదక్షిణాలు చేయడం మరియు వివాహం జరిపించడం తెలిసిన సంగతే !!

 



వృక్షాలను ఆలయ వృక్షాలుగా నిర్ణయించుకోడానికి వెనుక కూడా అనేక ఆరోగ్య రహస్యాలు ఉన్నాయి. కానీ ఒక చెట్టే ప్రధాన అర్చా రూపంగా నెలకొని ఉన్న ఆలయాలు మన రాష్ట్రంలో ఒకటి, కర్ణాటకలో రెండవది ఉన్నాయి.
ఒకటి "విదురాశ్వద్ధం" కాగా  రెండవది "తుమ్మ గుంట".(నెల్లూరు జిల్లా)
నెల్లూరు పట్టణానికి సమీపంలోని తుమ్మ గుంటలో జువ్వి చెట్టు శ్రీ ధర్మశాస్త రూపంగా పూజలు  అందుకొంటున్నది గత అయిదు వందల సంవత్సరాలుగా ! 






రెండవది అనంతపురం జిల్లా లోని హిందూపూర్ పట్టణానికి పదిహేను కిలో మీటర్ల దూరంలో కర్ణాటకలోని "గౌరీ బిదనూర్" తాలూకాలోని విదురాశ్వద్ధము.

ఆలయ పురాణ గాధ 

ఈ క్షేత్రం తాలూకు గాధ ద్వాపర యుగం నాటిదిగా తెలుస్తోంది.
మహాభారతంలో కురువంశంలో ధర్మానికి ప్రతిరూపమైన యమ ధర్మరాజ అంశతో జన్మించిన వాడు విదురుడు.
నీతి కోవిదునిగా పేరొందారు. ధర్మ శాస్త్ర  సంపూర్ణ  పరిజ్ఞానం కలిగిన శ్రీ కృష్ణ భక్తుడు.
అన్నదమ్ముల పిల్లలైన కౌరవులు పాండవులు రాజ్యం కోసం యుద్దానికి సిద్దపడటంతో వ్యాకుల పడ్డారు.
ద్రుత రాష్ట్రుని యుద్ధం ఆపమని అర్ధించారు.
పుత్ర ప్రేమతో దానికి మహారాజు పట్టించుకోక పోవడంతో జరిగే ఘోరాన్ని చూడలేక విరక్తి భావంతో కురుక్షేత్ర సమరానికి ముందు తీర్ధయాత్రలకు బయలుదేరారట. 

.



అనేక  పుణ్య తీర్ధ క్షేత్రాలను సందర్శించి దక్షిణా పధం లోని పినాకినీ నదీ తీరం లోని "మైత్రేయ మహర్షి" ఆశ్రమం చేరుకొన్నారట . 
మహాముని వద్ద వేదాంత విషయాలు తెలుసుకొంటూ అక్కడే కొంత కాలం గడిపారట. 
ఆ సమయంలో విదుర దేవునికి భవిష్యత్తులో మానవాళికి ప్రయోజనం చేకూర్చేది ఏదైనా చెయ్యాలి అన్న సంకల్పం కలిగింది.





ఒక రోజు మహర్షితో కలిసి నదిలో స్నానం చేస్తున్న సమయంలో ఒక రావి చెట్టు కొమ్మ నీటి ప్రవాహంలో కొట్టుకొని వచ్చినదిట.
మైత్రేయులవారు దానిని తీసి " నీ మనస్సులో మెదలిన శుభ సంకల్పానికి ఇదే మూలం. సాక్షాత్ శ్రీ హరి ప్రతి రూపమైన అశ్వద్ద శాఖను ఇక్కడ నాటు. అది భావి తరాలకు ప్రయోజనం చేకూర్చ గలదు" అని తెలిపారట.

 



తన మనోసంకల్పం  నెరవేరే అవకాశం వచ్చినందుకు ఆనందించిన విదురుడు మహర్షికి మొక్కి సంపూర్ణ విశ్వాసంతో ఆ కొమ్మను ఆశ్రమ పరిసరాలలో పాతారు.
కొద్ది కాలం లోనే అది చిగురించి మహా వృక్షంగా ఎదిగింది.
అమిత భక్తి శ్రద్దలతో పూజించిన విదురుడు కురుక్షేత్ర యుద్దసమయానికి ధృతరాష్ట్రుని కోరిక కాదనలేక హస్తినాపురానికి తిరిగి వెళ్లి పోతూ వృక్ష సంరక్షణార్ధం కొందరిని నియమించారు.



 




అలా విదురుడు నాటినందున "విదురాశ్వద్దము" అన్న పేరొచ్చినది.

ఆలయ విశేషాలు 

కాలక్రమంలో వృక్షాన్ని సేవించి ఫలితం పొందే భక్తుల సంఖ్య వృద్ది చెందటంతో క్షేత్ర ప్రాధాన్యత దినదినాభివృద్ది చెందసాగింది. రకరకాల ఇహలోక కోరికలతో ఎందరెందరో రావడం మొదలైనది. వారి అభీష్టాలు నెరవేరడంతో మరెందరో వచ్చేవారు. వస్తూనే ఉన్నారు. 
ఇక్కడికి వచ్చే వారిలో సంతానాన్ని అపేక్షించే దంపతులే అధికం.
వంశాన్ని నిలిపే ముద్దులు మూట కట్టే పసి పాపాలను పొందాలని ఎత్తుకొని లాలించాలని ఎవరికి ఉండదు ?

 




నియమంగా ప్రదక్షిణాలు చేసి, పూజలు జరిపించి రాహుకేతు సమేత నాగ ప్రతిష్ట చేసేందుకు అనేక మంది ప్రతి నిత్యం వస్తుంటారు.
ఫలితం పొందిన వారి సంఖ్య అసంఖ్యాకం అని ప్రాంగణం లోని వేల సంఖ్యలో ఉన్న ప్రతిష్టలే తెలుపుతాయి.
ఎటు చూసినా ప్రతిష్టలే !!!






సువిశాల ప్రాంగణానికి ఉన్న స్వాగత ద్వారానికి పైన  శ్రీ సుబ్రమణ్య, శ్రీ బ్రహ్మ మధ్యలో శ్రీ మహా విష్ణువు ఉండగా, ఇరుపక్కలా మైత్రేయ మహర్షి మరియు విదుర విగ్రహాలుంటాయి.
 విదురుడు నాటిన వృక్షం ఒక పెను తుఫానుకు భిన్నం అయ్యింది.
కానీ ప్రాంగణంలో ఆ వృక్షం తాలూకు బీజాలతో మొలకెత్తిన అనేక వృక్షాలు ఉన్నాయి.
నేలకొరిగిన చెట్టు మూలానికే ప్రస్తుతం పూజలు చేస్తున్నారు.
ఇక్కడే శ్రీ శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ అశ్వద్ద నారాయణ మూర్తి కొలువై వుంటారు.
వెనక వైపున శ్రీ చెన్నకేశవ స్వామి కొలువై ఉంటారు.


 
 










ప్రాంగణంలో శ్రీ గణపతి, శ్రీ కాశీ విశ్వేశ్వర, శ్రీ వీరాంజనేయ, ఆలయాలు, నవగ్రహ మండపం ఉంటాయి.
గ్రామంలో శ్రీ పాతాళ ఆంజనేయ ఆలయం మరియు శ్రీ సత్యనారాయణ స్వామి ఆలయం పురాతనమైనవి.
తప్పక సందర్శించవలసినవి.






.

ఎన్నో పూజలు, అర్చనలు శ్రీ అశ్వద్ద వృక్షానికి, శ్రీ అశ్వద్ధ నారాయణునికి మరియు శ్రీ చెన్నకేశవ స్వామి వార్లకు నిత్యం జరుగుతుంటాయి. 
ప్రతి సంవత్సరం చైత్ర మాసంలో శ్రీ అశ్వద్ద నారాయణ స్వామి వారి రధోత్సవం జరుగుతుంది. 
 భక్తులు లక్షలాదిగా పాల్గొంటారు.



 










అశ్వద్ద వృక్షాన్ని త్రిమూర్తి స్వరూపంగా శాస్త్రాలలో ఉదహరించబడినది.
సృష్టి స్థితి లయకారకుల శక్తిని ప్రదర్శిస్తుందని ఆయుర్వేదం పేర్కొన్నది.
ఈ వృక్షం యొక్క ఔషద గుణాలను పరిశీలిస్తే అదెంత సత్యమో అవగతమౌతుంది.
రావిచెట్టు వేరు రసంతో చేసిన ఔషధాలతో గర్భస్రావం ఆగుతుంది.
అశ్వద్ద సమిధలను యజ్ఞ యాగాదులలో హోమం చేయడానికి ఉపయోగిస్తారు. అలా జరిగే హోమ ధూపం వలన ఆరోగ్యవృద్ది మరియు సంపూర్ణ ఆయుర్దాయం కలుగుతాయన్నది పురాణ వాక్యం.
అశ్వద్ద వృక్ష చిగురుటాకుల రసం సేవిస్తే అవాంచిత గర్భం తొలగిపోతుంది. వృక్షం చుట్టూ తిరుగుతూ చేసే ప్రదక్షిణల కారణంగా వీచే గాలిని పీల్చడం వలన శరీరంలో కావలసిన మార్పులు ఏర్పడి గొడ్రాళ్ళు సంతానవతులు  కాగలరు. 
ఇలా ఎన్నో ప్రయోజనాలు మానవాళికి ప్రసాదిస్తుంది అశ్వద్ధ వృక్షం. 

 


 
 

ఇంతటి విశేష ఆరోగ్య ప్రయోజనాలను అందించే అశ్వద్ధ వృక్షాన్ని తన పేరుగా మార్చుకున్న గ్రామం మరెన్నో విశేషాలను కలిగి ఉన్నది.  స్వతంత్ర సంగ్రామంలో ఎందరో యోధులను అందించిన  గ్రామం. వారి దేశాభిమానాన్ని, దేశ గౌరవం మరియు స్వతంత్రం కొరకు వారు  సల్పిన పోరాటాన్ని, త్యాగాన్ని  గుర్తిస్తూ  గ్రామస్థులు ఆలయం వెనుక స్వాతంత్ర సమర యోధుల స్మారక చిహ్నం స్థాపించారు. స్వతంత్ర దినోత్సవం నాడు ఎన్నో కార్యక్రమాలను నిర్వహిస్తారు. 




దైవ భక్తులు , వృక్ష ప్రేమికులు ప్రతిఒక్కరూ సందర్శించవలసిన క్షేత్రం "విదురాశ్వద్దము". అనంతపరం జిల్లా హిందూపూర్ పట్టణం నుండి సులభంగా రోడ్ మార్గంలో చేరుకొనవచ్చును. 
పదిహేను కిలో మీటర్ల దూరం. ఉండటానికి తగు మాత్రం ఏర్పాట్లు లభిస్తాయి. 

"మూలతో బ్రహ్మ రూపాయ 

మధ్యతో విష్ణు రూపినే 

అగ్రతః శివ రూపాయ 

వృక్ష రాజః యతే నమః !"



కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...