23, నవంబర్ 2014, ఆదివారం

Sri Kailasanathar Temple,Thara Mangalam, Salem



                         శ్రీ కైలాస నాథర్ ఆలయం, తారమంగళం 


To,


 

వినాయకుడు సదాశివుడు, శ్రీ హరి, అమ్మవారు, కుమార స్వామి ఇలా దేవుడు లేదా దేవత ఎవరు కొలువుతీరినా సుందర  శిల్ప శోభ మాత్రం అద్వితీయంగా దర్శనమీయడం తమిళ నాడులోని ఆలయాలలో ప్రస్పుటంగా కనపడుతుంది. దానికి మరో ఉదాహరణ "ధారైమంగళం "గా గతంలో పిలవబడి నేడు " తార మంగళం" పిలవబడుతున్న ఊరిలోని   "శ్రీ కైలాస నాథర్ ఆలయం ".












ఆలయ గాధ పరమేశ్వరుడు కొలువైన అనేక క్షేత్రాలలో వినిపించేదే !
సుమారు వెయ్యి సంవత్సరాల క్రిందట స్థానిక రాజుగారి గోవుల మంద లోని ఒక ఆవు నిత్యం ఒక ప్రదేశంలో తన పొడుగు నుండి పాలను ధారగా వదులుతుండేదట. కారణాన్ని అన్వేషించే క్రమంలో అక్కడ తవ్వగా శివ లింగం లభించినదట. రాజు తన అదృష్టానికి పొంగిపోయి సాక్షాత్ కైలాస  వాసుడే సాక్షాత్కరించాడని స్వామిని " కైలాస నాథర్ "గా పేర్కొంటూ ఆలయాన్ని నిర్మించాడట. ఆలయంలో పాలు విడుస్తున్న గోవు శిల్పాలు చాలా స్తంభాల మీద కనపడతాయి. 
తదనంతర కాలంలో పల్లవ, చోళ, పాండ్య, నాయక రాజులు ఆలయ అభివృద్దికి తమ వంతు కృషి చేశారని ప్రాంగణంలో చెక్కిన ఆయా వంశ చిహ్నాలు ధనుస్సు, చేప లాంటివి   తెలుపుతున్నాయి. 


















ప్రస్తుత ఆలయానికి  పద్దెనిమిదో శతాబ్ద కాలంలో ఈ ప్రాంతాన్ని పాలించిన "గెట్టి మొదలి " అనే రాజు తగిన  మరమ్మత్తులు చేయించడమే కాకుండా ఐదు అంతస్తుల రాజ గోపురాన్నికూడా నిర్మించాడని స్థానిక గాధల ఆధారంగా తెలుస్తోంది.  












తొంభై అడుగుల ఎత్తు గల గోపుర ద్వారానికి అమర్చిన ఇత్తడి రేకులు, గుబ్బలు నేటికీ చెక్కు చెదరక పోవడం నాడు నాణ్యతకు ఇచ్చిన ప్రాధాన్యత అర్ధం అవుతుంది. 


















ఈ ఆలయంలో ఆసక్తికర నిర్మాణ అంశం ఒకటి కనపడుతుంది. రాజ గోపురం ఆలయం కన్నా ఎత్తులో ఉండి దారిన పోయే వారు వెలుపలి నుండే చాలా లోపలికి గర్భాలయంలో కొలువైన  లింగాన్ని దర్శించుకోనేలా నిర్మించడం. గోపురం లోపలి వైపున మెట్లకు ఇరువైపులా రెండు ఏనుగుల విగ్రహాలతో కలిపి రధాన్ని పోలి వుండటం మరో ప్రత్యేకత. ఈ రెండు గజరాజులు  నిర్మాణపు పనులలో పాల్గొని శివుని సేవలో తమ జీవితాలను సార్ధకం చేసుకోన్నగుర్తుగా విగ్రహాలుగా నిలిపారని అంటారు. 


















సువిశాల ప్రాంగణంలో ఉన్న ఉపాలయాలతొ పాటు ప్రధాన ఆలయం ఒక అద్భుత శిల్ప సంపదను కనుల ముందు నిలబెడుతుంది. యెర్ర ఇసుక రాతి మీద నాటి శిల్పులు చెక్కిన అనేకానేక పెద్ద మరియు చిన్న శిల్పాలు వారి  ప్రతిభా పాటవాలను తర తరాలకు తెలిసేలా చేస్తున్నాయి. ఎన్నో అద్భుత శిల్ప కళా విన్యాసాలను ఇక్కడ వీక్షించే అవకాశం లభిస్తుంది. 













ప్రాంగణం లోని వెలుపలి ప్రదక్షణా పధంలో కుడివైపున సహస్ర లింగం, ఎడమవైపున అవినాశి అప్పార్ సన్నిదులుంటాయి.















ధ్వజస్తంభం, బలి పీఠం మరియు నంది మండపం తో పాటు ప్రాంగణం మధ్యలో చిన్న వేదిక మీద నిర్మించిన చిన్న వినాయక సన్నిధి ప్రత్యేకంగా ఉంటాయి.












ప్రధాన ఆలయ వెలుపలి స్థంభాలకు చెక్కిన చిత్ర విచిత్రమైన జంతువుల శిల్పాలు చూపరులను ఆకట్టుకొంటాయి.












ముఖ్యంగా "ఎలి " అని పిలవబడే సింహము మరియు ఏనుగు రూపాలు కలబోసినట్లుగా ఉండే పురాణ కాలంనాటి మృగం తెరుచుకొన్ననోటిలో తిరిగే బంతిని చెక్కిన తీరు విస్మయపరుస్తుంది. 
అది నోటి లోంచి రాదు. అడ్డంగా చెక్కిన దంతాలు ఆపుతాయి. చేతితో తిప్పవచ్చు. 
అత్యుత్సాహం చూపిస్తున్న సందర్శకుల నుండి కాపాడటానికి ప్రస్తుతం వాటి చుట్టూ ఇనప పంజరాలను ఏర్పాటు చేసారు.  





















ప్రదక్షిణా పధంలో తూర్పు వైపు గోడల పైన పెద్ద నందులను ఏర్పాటు చేస్తున్నారు.












వాహన మండపంలో అనేక రకాల వాహనాలను ఉంచారు. ఉత్సవాల సందర్బంగా రకరకాల వాహన సేవలు నిర్వహిస్తారు. 














లోపలి ప్రవేశిస్తే ఒక అద్భుత శిల్ప ప్రపంచం కనుల ముందు కనపడుతుంది. ముఖ్యంగా చెప్పవలసినవి కొన్ని ఉన్నాయి.ద్వారం వద్ద నుండి గర్భాలయం వరకు ఉన్న మార్గానికి రెండు వైపులా చెక్కిన ఆరు స్తంభాల మీద చెక్కిన రాజు గారి వేట దృశ్యాలు మనోహరంగా ఉంటాయి.
గర్భాలయం ఎదురుగా ఉన్న ఆరో స్తంభం మొదలులో ధనుర్భాణాలు ధరించిన శ్రీ రామచంద్ర రూపాన్నినాలుగో స్థంభం మొదలులో మల్ల యుద్ధం చేస్తున్న వాలి సుగ్రీవుల శిల్పాలను చెక్కారు.రాముని వైపు నుంచి చూస్తే వాలి కనపడతాడు.కానీ వాలి వైపు నుండి రాముడు కనిపించడు. అలాంటిదే మరొకటి నటరాజ మండపం వద్ద కనపడుతుంది. రతీ మన్మధుల విగ్రహాలను  ఆరు అడుగుల దూరంలో రెండు స్థంభాల మీద మలచారు. మన్మధుని కంటి నుండి చూస్తే రతి కనపడుతుంది. కానీ రతి కంటి నుండి చూస్తే మన్మధుడు కనపడడు. ఒక నిర్ణీత స్థలం నుండి చూస్తే ఇద్దరూ మనకి కనపడతారు.
రాముని మూర్తి ఉన్న స్థంభం పైభాగాన నోటిలో తిరిగే రాతి బంతి ఉన్న మూడు ఎలి తలలను నేర్పుగా మలచారు నాటి శిల్పులు .ఇలాంటి మూడు తలల ఎలి మరో ఆలయంలో లేదని చెబుతారు. మార్గానికి ఎడమ వైపున అమ్మవారి, కుడి వైపున శ్రీ సుబ్రహ్మణ్య సన్నిధి ఉంటాయి.












అంతర ప్రదక్షిణ లో ఎన్నో శిల్పాలు కనపడతాయి. అందులో ఏక శిల పైన చెక్కిన ఊర్ధ్వ తాండవ మూర్తి, భిక్షాందార్, దేవి రూపాలు చెప్పుకోదగినవి. గణపతి, భైరవ, దుర్గా, చెండికేశ్వర  సన్నిధి లుంటాయి. ఇక్కడ కూడా నోటిలో బంతి ఉన్న ఎలి చెక్కారు ఒక స్థంభము మీద,కానీ ఈ బంతి తిరగదు. 
గర్భాలయ వెలుపలి గోడల పైన ఎన్నో శాసనాలు కనపడతాయి. గర్భాలయ ద్వారం వద్ద పై కప్పుకు చెక్కిన పద్మం మద్యలో తిరిగే లాగా చెక్కారు. దానికి నాలుగు పక్కలా ఏక రాతితో గొలుసులను చెక్కి వెళ్లాడ తీసారు. లోపల కొద్దిగా పక్కకు ఒరిగి ఉన్న లింగ రూపంలో శ్రీ కైలాస నాథర్ చందన విభూతి లేపనాలతో చక్కని పుష్పాలంకరణతో దర్శనమిస్తారు. గర్భాలయ   ద్వారం పైన సోదరి పార్వతిని కైలాస వాసునికి అప్పగిస్తున్న శ్రీ మహా విష్ణు రూపాలను అద్భుతంగా మలచారు. తమిళంలో ఈ ఘట్టాన్ని "తారై వర్తాల్" అంటారట. అందుకే ఈ క్షేత్రానికి "తార మంగళం" అన్న పేరు. 
మరొక నిర్మాణ కౌశలాన్ని తెలిపే విశేషం ఇక్కడ సంవత్సరానికి ఒక సారి కనపడుతుంది. 
ప్రతి ఏడాది ఫిబ్రవరి నెల ఇరవై ఒకటి నుండి మూడు రోజులు సాయం సంధ్యా సమయంలో అస్తమిస్తున్న సూర్య కిరణాలు గోపురాని కున్న రంధ్రాల గుండా నేరుగా లోపల ఉన్న లింగాన్ని తాకుతాయి. 














అంతరాలయంలో భూగర్భంలో ఆలయ ఆగ్నేయంలో ఉన్న బొటన వేలు పరిమాణంలో ఉండే  పాతాళ లింగం తప్పక చూడాలి. క్రిందకు వెళ్ళే మార్గం మూసి వేయబడి ఉంటుంది. పూజారి గారిని అడిగితే  తెరుస్తారు.  












ఈ ఆలయానికి కొద్ది దూరంలో శ్రీ వరద రాజ స్వామి ఆలయం ఉంటుంది.






తార మంగళం లో మరో విశేషం ఆలయ పుష్కరణి. 
బ్రహ్మ తీర్ధ పుష్కరణి నలువైపులా కలిపి గోడల పైన ముప్పై ఆరు నందులను నిలిపారు. 
గోడలకు మూడు మూడు చొప్పున  అంటే మొత్తం మూడు వందల అరవై అయిదు దీపాలను ఒక్కసారే వెలిగించే ఏర్పాటు చేసారు. 








ఈ అద్భుత ఆలయం సేలం పట్టణానికి సుమారు ఇరవై అయిదు కిలో మీటర్ల దూరంలో ఉంటుంది. సేలం రైల్వే స్టేషన్ నుండి 6 A నంబరు బస్సు నేరుగా తార మంగళం చేరుస్తుంది. బస్సు స్టాండ్ ఎదురుగానే ఆలయం. 


నమః శివాయ !!!!!




కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...