16, అక్టోబర్ 2014, గురువారం

Tiruvambadi Sri Krishna Temple, Thrissur


                           తిరువంబాడి శ్రీ కృష్ణ ఆలయం, త్రిస్సూర్ 

ప్రపంచ ప్రసిద్ది చెందిన "త్రిస్సూర్ పూరం"లో ప్రధాన పాత్ర పోషించే మూడు ఆలయాలలో రెండవ స్థానం ఈ ఆలయానిదే !
మళయాళ క్యాలెండరు " కొల్లవర్షం "ప్రకారం  " మాడం " ( ఏప్రిల్ - మే )మాసంలో మూడు రోజుల పాటు జరిగే "త్రిస్సూర్ పూరం"లో పాల్గొనే పది ఆలయాలలో తిరువంబడి పడమర దిశ జట్టుకు సారధ్యం వహిస్తుంది.
త్రిస్సూర్  పట్టణ నది బొడ్డున ఉన్నస్వరాజ్ రౌండ్ లో ఉంటుంది శ్రీ వడక్కు నాథర్ స్వామి ఆలయం.
కేరళ తొలి ఆలయం గా ప్రసిద్ది చెందినది.
సుమారు మూడువందల సంవత్సరాల క్రిందట ఆరంభించబడిన" పూరం" తప్పనిసరిగా చూడవలసిన ఉత్సవం.




రాష్ట్రము లోని అనేక ఆలయ గజ రోజులు తరలి వచ్చి పాల్గొనే ఈ పూరం లో ఒక జట్టు ఈ ఆలయం పేరున ఉంటుంది. 
ఈ విశేష క్షేత్రం యొక్క చారిత్రిక విశేషాలు ఇలా ఉన్నాయి. 
శ్రీ కృష్ణ ఆలయంగా పిలవబడుతున్న ఈ ఆలయంలో "ఉన్ని కృష్ణ " ( బాల కృష్ణుడు ) తో పాటు "శ్రీ భగవతి అమ్మవారు" కూడా కొలువుతీరి కనపడతారు. 
బయటికి కేరళ నిర్మాణ శైలి దర్శనమిచ్చినా లోపల గర్భాలయం, దేవతల పేర్లు ద్రావిడ సంప్రదాయాన్ని ప్రతిబింబిస్తాయి.
 నాలుగు వందల సంవత్సరాల క్రిందట త్రిసూర్ కి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న " తిరువంబాడి " అనే గ్రామంలో శ్రీ పార్ధ సారధి ఆలయం ప్రసిద్ద చెందినది. 
చతుర్భుజాలతో కొలువైన స్వామి స్థానికులకు ఆరాధ్య దైవం.
 నిరంతరం మైసూరు నవాబుల దాడుల భయంతో బ్రతుకుతుండే వారు ఇక్కడి ప్రజలు.
ఆలయం మీద దాడి జరిగే ప్రమాదాన్ని ఊహించిన భక్తులు మూల విరాట్టును రహస్యంగా నేడు ఆలయం ఉన్న ప్రాంతానికి తరలించి ఇక్కడ నివసించే బ్రాహ్మణ దంపతులకు అప్పగించారట. 
బిడ్డలు లేని ఆ దంపతులు స్వామిని తమ బిడ్డగా భావించి పూజించడానికి బదులుగా ప్రేమించేవారట. 
వారు గతించిన తరువాత స్థానికులు అనుకూలించిన పరిస్థితులలో ఆ మూర్తికి ఒక ఆలయాన్ని నిర్మించాలని తలపెట్టారట. 
ఒక నాటి రాత్రి స్వామి గ్రామ పెద్దకు స్వప్నము లో కనపడి తనను బాల కృష్ణ గా ప్రతిష్టించి ఆ మాదిరి అలంకరణ చేయవలసినదిగా ఆదేశించారట. 
ఆ ప్రకారమే చేసారట. 
వేణువు ధరించి ముద్దులొలికే మోముతో యశోదా కృష్ణుడు నయన మనోహరంగా దర్శనమిస్తారు. 
పక్కనే ఉన్న మరో శ్రీ కోవెలలో "శ్రీ బాల భద్ర కాళీ అమ్మవారు" కొలువై ఉంటారు. 



తిరువంబాడి గ్రామస్తుల నుండి శ్రీ పార్ధ సారధి విగ్రహాన్ని గ్రహించిన బ్రాహ్మణ దంపతులు కొడంగల్లూర్ భగవతి ని భక్తి ప్రపత్తులతో ఆరాధించేవారట.
ప్రతి నెలా వెళ్లి అమ్మ వారిని సేవించుకొని వచ్చేవారట.
కొన్ని సంవత్సారాల తరువాత వృదాప్య కారణంగా యాత్ర చేయలేక ఇదే తమ చివరి సేవ అని విన్నవించుకొని శోకతప్త హృదయాలతో తిరుగు ప్రయాణం అయ్యారట.
వారెంత భాధ పడుతున్నారో అర్ధం చేసుకొన్నఅమ్మవారు తన నిజ భక్తుల సేవలను పొందాలని తలంచి వారికన్నా ముందే ఇక్కడికి చేరుకొని ఒక స్తంభంలో ప్రకటితమయ్యారట.
తదనంతర కాలంలో మరో ఆలయాన్ని నిర్మించారు.
ఉప ఆలయాలలో కుక్షి అయ్యాప్ప, మణి కంఠ స్వామి, భైరవు లతో పాటు ఘంటా కర్ణ మరియు రక్తేశ్వరి కొలువై ఉండటం ప్రత్యేకంగా చెప్పుకోవాలి.








ఆలయ వెనుక శ్రీ గణపతి, శ్రీ సుబ్రహ్మణ్య మరియు శ్రీ ఆంజనేయ ఆలయం నూతనంగా నిర్మించబడినది.

ఉదయం నాలుగు గంటల నుండి పదకొండు వరకు తిరిగి సాయంత్రం అయిదు నుండి రాత్రి ఎనిమిదిన్నర వరకు తెరిచి ఉండే ఆలయంలో "వక చరతు" ( నలుగు పెట్టి చిన్న పిల్లలకు చేయించే స్నానం ) తో ఆరంభం అయ్యే సేవలు రాత్రికి "అతల పూజ " తో ముగుస్తాయి.
సంవత్సరం అంతా ఎన్నో ఉత్సవాలు జరుగుతాయి. ప్రతిస్థా దినం, అన్ని హిందూ పర్వదినాలలో ఎన్నో ప్రత్యేక పూజలు జరుగుతాయి.
కృష్ణాష్టమి, వైకుంఠ ఏకాదశి ముఖ్య దినాలు.
కుంభం మాసం ( ఫిబ్రవరి - మార్చి )లో నిర్వహించే ఎనిమిది రోజుల ఆలయ ఉత్సవాలలో రాష్ట్రమంతటి నుండి భక్తులు పాల్గొంటారు.
ధనుర్మాసంలో వచ్చే తోని బుధ వారం నాడు నిర్వహించే "కుచేల దినం " ఈ ఆలయ ప్రత్యేకం. ఈ పూజ తరువాత పంచె ప్రసాదం స్వీకరిస్తే జీవతంలోని సమస్త దారిద్యాలు దూరం అవుతాయి అన్నది స్థానిక విశ్వాసం.



త్రిస్సూర్ పూరం లో పాల్గొన్న ఈ ఆలయ జట్టుకు ఎన్నో సంవత్సరాలు నాయకత్వం వహించినది "గజ కేసరి తిరువంబాడి చంద్ర శేఖర్ ".  చివరకి అదే పూరం సంబరాలలో మరో పేరొందిన ఏనుగు "తెచ్చి కొట్టు క్కావు రామచంద్రన్ " జరిపిన దాడిలో మరణించడం చెప్పుకోవాల్సిన విషయం.
నిత్యం వంద మంది భక్తులకు అన్న ప్రసాదాలను అందిస్తారు.
ఇంతటి ప్రసిద్ద ఆలయం త్రిస్సూర్ పట్టణంలో షోరనూర్ రోడ్ లో బస్టాండ్ మరియు రైల్వే స్టేషన్ కు సమీపంలో ఉంటుంది.
ప్రసిద్ద వడక్కు నాథర్ ఆలయానికి అత్యంత చెరువలో ఉంటుందీ ఆలయం.
కృష్ణం వందే జగద్గురుం !!!!!

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...