5, అక్టోబర్ 2014, ఆదివారం

Sri Harikanyaka Bhagavathi Temple, Ariyanoor

                        శ్రీ హరి కన్యకా భగవతి టెంపుల్, అరియనూరు

కేరళ ఆలయాలు అంటేనే కొంత భిన్నత్వం కనపడుతుంది. 
నిర్మాణం, పూజా విధానం, చరిత్ర, పౌరాణిక నేపద్యం, మూల విరాట్టు, ఉపాలయాలు ఇలా  ఏది తీసుకొన్న మిగిలిన భారతీయ ఆలయాలకు మాదిరిగా కాకుండా ప్రత్యేకంగా ఉంటాయిక్కడి ఆలయాలు. 
అలాంటి వాటిల్లో శ్రీ హరి కన్యకా భగవతి అమ్మవారి ఆలయం ఒకటి. 
ప్రస్తుతం రక్షిత నిర్మాణంగా గుర్తించబడిన ఈ ఆలయం పరిశోధకుల ప్రకారం వెయ్యి సంవత్సరాల క్రిందట నిర్మించబడినది. కానీ స్థానిక విశ్వాసం ప్రకారం ఇంకా పురాతనమైనది. 
క్రీస్తు పూర్వం ఒకటో శతాబ్దానికి చెందిన "విక్రమాదిత్య మహారాజ " కొలువులో వుండిన ప్రముఖ శిల్పి "పెరున్ థాఛన్ " రూపకల్పన చేసిన అనేక ఆలయాలలో ఇదొకటి. ఈ మహా శిల్పి గురించి అనేక పురాతన మళయాళ గ్రంధాలలో సవివరంగా ఉదహరించబడినది అని అంటారు.
ఈ ఆలయానికి సంబంధించిన పురాణగాధ కృతయుగానికి చెందినదిగా తెలుస్తోంది. 













అమృతం కొరకు దేవ దానవులు పాల కడలిని చిలికిన సంగతి మనందరికీ తెలిసిన కధే !
లోక కంటకులైన రాక్షసులకు అమృతం లభించకుండా చేయడానికి శ్రీ విష్ణు (హరి) మోహినీ అవతారం ధరించి, తన అందచందాలతో అసురులను మైమరపిస్తూ అమృతాన్ని దేవతలకు పంచారు. 
ఆ మోహినీ అవతారమే శ్రీ హరి కన్యకా భగవతి. 
కేరళ భగవతి ఆలయాలకు ప్రసిద్ది. 
శ్రీ పార్వతీ దేవే భగవతిగా పిలవబడుతోందిక్కడ. 
భగవతి అమ్మన్ ఉగ్ర రూపంలో ఉపస్థిత భంగిమలో అనేక ఆయుధాలతో పాటు కొన్ని చోట్ల శంఖం ధరించి ఉంటారు. కానీ ఆయుధాలలో చక్రం కనపడదు.  
కానీ ఇక్కడ శ్రీ హరి కన్యకా భగవతి ప్రసన్న రూపంలో స్థానక భంగిమలో శంఖు చక్రాలను వెనక హస్తాలలో,
ముందరి కుడి చేతిలో అమృత భాండము ధరించి, ఎడమ చేతిని నడుము మీద ఉంచి దర్శనమిస్తారు. 



ఇలా కొలువైన హరి మోహినీ ఆలయం ఇదొక్కటే !
ఈ సుందర రూపంలో ఉన్న శ్రీ మన్నారాయనుని చూసిశంకరుడు  చలించడం వలన వారిరువురి అంశతో శ్రీ ధర్మ శాస్త జన్మించారని అంటారు. 
అందుకే హరి మోహినే శ్రీ ధర్మశాస్త తల్లిగా భక్తులు భావిస్తారు. 

ఇంతటి పురాణ ప్రాశస్తం గల ఆలయం దూరానికి సాదా సీదా ఆలయంగానే కనిపిస్తుంది. 
ఎలాంటి విరాట్ నిర్మాణాలు, శిల్పాలు లేకుండా నలుచదరపు పెంకులతో కప్పబడిన వెలుపలి ప్రాకారం. 
ధ్వజస్తంభం కూడా ఉండదు. 
నైరుతిలో భద్రకాళి ఉపాలయం. 































ప్రధాన ఆలయం లోనికి చేరే ముందు సునిశిత చెక్కడాలతో ఆకట్టుకొంటుంది బలి పీఠం. 
లోపలకు ప్రవేశించగానే బాగా క్రిందకు ఉన్న నమస్కార మండపం. 
మండపా లోపలి పైభాగాన చెక్క మీద దశావతార రూపాలను చక్కగా మలచారు. 












అంతర్భాగం లోని మండపాల స్తంభాలు ఎర్ర  ఇసుక మరియు రాతి స్తంభాల మీద పెంకులు కప్పారు. 
శ్రీ కోవెల కూడా ఎర్ర ఇసుక రాతితో నిర్మించారు. 
గోడల వెలుపల ఒకప్పుడు చక్కని వర్ణ చిత్రాలు వుండిన దాఖలాలు కనిపిస్తాయి. 
రాతి మీద ఏనుగు అనేక ఇతర జంతువుల ముఖాలను జీవం ఉట్టి  పడేలా చెక్కారు. 







శ్రీ కోవెల రెండో అంతస్తు పైన కూడా జంతువుల బొమ్మలు నిలిపారు. 


చతురస్రపు గర్భాలయంలో అయిదు అడుగుల ఎత్తు శ్రీ హరి కన్యకా భగవతి స్వర్ణ కవచ ధారిణిగా నయన మనోహరంగా దర్శనమిస్తారు. 
మైసూర్ సుల్తాను "టిప్పు" ఈ ప్రాంతం మీద జరిపిన దండయాత్రలో విగ్రహం దెబ్బ తిన్నందువల్ల స్వర్ణ కవచం కప్పారు. 














శ్రీ హరికన్యకా భగవతికి ఎన్నో రకాల సేవలు ప్రతి నిత్యం నియమంగా జరుపుతారు.
ఫిబ్రవరి నెలలో మూడు రోజుల పాటు ఆలయ ఉత్సవాలు నిర్వహిస్తారు.








ఈ అరుదైన క్షేత్రం ప్రముఖ కృష్ణ ఆలయం ఉన్న గురువాయూర్ కి ఐదు కిలోమీటర్ల దూరంలో త్రిస్సూర్ మార్గంలో ఉన్నది. త్రిస్సూర్ నుండి గురువాయూర్ వెళ్ళే బస్సులు అన్నీ ఇక్కడ ఆగుతాయి. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...