15, ఏప్రిల్ 2014, మంగళవారం

nagalapuram - sri vedanarayana swamy Temple


                   శ్రీ వేద నారాయణ స్వామి ఆలయం - నాగులాపురం 

నారాయణుడు లోకాలను అసురుల బారి నుండి సంరక్షించే క్రమంలో అనేక అవతారాలు ధరించిన విషయం మనందరకు తెలిసినదే. 
పురాణాల ప్రకారం అవి ఇరవై నాలుగు అవతారాలని నిర్ధారించాయి. 
 వాటిల్లో అత్యంత ప్రసిద్ది చెందినవి  దశావతారాలు. 
 వీటి అన్నింటిలో తొట్ట తొలి అవతారం మత్స్యావతారం.
శ్రీ హరి ఈ అవతారం ఎత్తడానికి కారణం తెలుసుకోవడానికి ముందు కొంత సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది.
అదే మన పురాణాలలో ఉదహరించిన యుగాల కాల నిర్ణయం.
సృష్టి కర్త అయిన ' బ్రహ్మ దేవుని" కాల పరిమితి వంద దైవ సంవత్సరాలు.
ఈ వంద సంవత్సరాలలో మూడువందల పగళ్ళు, మూడువందల రాత్రులూ ఉంటాయి.
"కల్పము" అనగా విధాతకు ఒక రోజు.
ఒక కల్పము తిరిగి పదునాలుగు మన్వంతరాలుగా విభజింపబడినది.
ఒక్కో మన్వంతరానికి ఒక్కో మనువు పాలకుడిగా ఉంటాడు. వీరు పాలించే కాలాన్ని డెభై ఒక్క మహా యుగాలుగా నిర్నయించబడినది.
ఒక్కో మహా యుగంలో "సత్య (కృత), త్రేత, ద్వాపర మరియు కలి" యుగాలుంటాయి.
మానవ లెక్క ప్రకారం ఈ నాలుగు యుగాలు కలిపితే  43,20,000 సంవత్సరాలు.
వేయి మహా యుగాలు బ్రహ్మ దేవునికి ఒక పగలు లేదా రాత్రి.
ఈ లెక్క ప్రకారం మనం ప్రస్తుతం వైవస్వత మనువు పాలనలో ఉన్నాము.
ప్రతి కల్పాంతానికి విధాత కొంత విశ్రాంతి తరువాత పునః సృష్టిని ప్రారంభిస్తారు.
అలాంటి సమయంలో " హయగ్రీవుడు" అనే అశ్వ ముఖ గల అసురుడు నిద్రిస్తున్న కమలాసనుని నుండి సృష్టికి మూలమైన వేదాలను అపహరించుకొని సాగర గర్భంలో దాక్కున్నాడు.
అదే సమయంలో వైవస్వతుడు అనే సూర్య కుమారుడు నదిలో ప్రభాతునుకి అర్ఘ్యం ఇస్తుండగా నీటితో పాటు చేతిలోనికి ఒక చేప పిల్ల వచ్చినది.
అతను దానిని తిరిగి నీటి లోనికి వదలబోగా మానవ భాషలో ఆ మీనం "రాజా నదిలో తిరుగుతున్న పెద్ద పెద్ద చేపల నుండి నన్ను నేను కాపాడుకొనే క్రమంలో నీ చేతిలోనికి చేరుకొన్నాను. నన్ను కాపాడు !!" అన్నది.
రాజు దానిని తన కమండలంలో ఉంచగా కమండలం చాలనంతగా పెరిగిపోయినది.
అలా ఎక్కడ ఉంచితే అక్కడ ఆ మత్స్యం తన ఆకారాన్ని పెంచుకొంటూ ఉండటంతో వైవస్వతుడు దానిని సామాన్య చేప కాదని అర్ధం చేసుకొని సముద్రంలో వదిలి ముకుళిత హస్తాలతో వినయంగా " స్వామీ ! మీరెవరు ?" అని ప్రశ్నించారు.
అప్పుడా చేప రూపంలో ఉన్న జగన్నాధుడు నిజ రూప దర్శనం యిచ్చి " నాయనా ! నేటికి మానవ లెక్క ప్రకారం ఏడు రోజుల తరువాత జల ప్రళయం సంభవించి లోకాలన్నీ అదృశ్యం కానున్నాయి.
ఈ అల్ప సమయంలో నీవు అన్ని పుష్ప, ఫల ఇతర వృక్షాల, మొక్కల గింజలను, లోకంలో ఉన్న అన్ని జీవ రాసుల నుంచి ఒక్కో జంటను సిద్దం చేయి. ఆ నాడు నేను పంపే నావలో మీరంతా  సరికొత్త సృష్టి వైపుకు ప్రయాణం  చేయాలి. " అని చెప్పి సముద్రంలో దాగివున్న రాక్షసుని అంతం చేసి వేదాలను తిరిగి బ్రహ్మ దేవునకు అప్పగించారు శ్రీ వేద నారాయణులు.
వైవస్వతుడు భగవానుని ఆదేశం ప్రకారం చేసి పునః సృష్టికి మార్గం సుగమనం చేసి కొత్త మనువుగా బాధ్యతలను స్వీకరించారు.
మత్స్యావతార ఆలయాలు మన దేశంలో చాలా కొద్ది.
మొత్తం నాలుగు ఉన్నాయని తెలుస్తోంది.
శ్రీ కృష్ణుడు నడయాడిన భూమిగా పేరొందిన ద్వారక కు సుమారు ముప్పై అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న "భేట్ ద్వారక"లో ఉన్న "శంఖోదర ఆలయం" లో ఉత్తర భారత దేశానికి సంబంధించినది ఉండగా, మిగిలిన మూడు దక్షిణ భారత దేశంలో ఉన్నాయి.
తమిళనాడు లోని తిరునల్వేలి జిల్లా అంబ సముద్రం కి అయిదు కిలోమీటర్ల దూరంలో ఉన్న "మన్నార్ కోవిల్" లో ఒకటి ఉండగా మిగిలిన రెండూ మన రాష్ట్రంలో ఉండటం చెప్పుకోదనిగిన విషయం.
వీటిల్లో మొదటిది కలియుగ వైకుంఠమైన తిరుమల తిరుపతికి సుమారు డెభై కిలో మీటర్ల దూరంలో ఉన్న "నాగలా పురం" కాగా రెండవది గుంటూరు జిల్లా నరసరావు పేటకు సమీపం లోని ( నాలుగు కిలోమీటర్లు ) " ములకలూరు".
అన్నింటి లోనికి నాగలాపురం శ్రీ వేద నారాయణ స్వామి ఆలయం చాలా ప్రసిద్ది చెందినది.
  


విజయనగర సామ్రజ్యాధీశుదు అయిన శ్రీ కృష్ణ దేవరాయలు తన తల్లి "నాగలాంబ" పేరు మీద ఈ  ఆలయం తో పాటు పట్టణాన్నినిర్మించారని చారిత్రక ఆధారాలు తెలియ చేస్త్తున్నాయి.

సువిశాల ప్రాంగణంలో పడమర దిశలో నిర్మించబడిన ప్రధాన ఆలయంతో పాటు ఎన్నో ఉప ఆలయాలు కలవు.
శ్రీ లక్ష్మీ నారసింహ స్వామి, శ్రీ భక్తాంజనేయ, శ్రీ వీరాంజనేయ, శ్రీ సీతాలక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర మూర్తి ఉంటారు.
గర్భాలయంలో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ వేద నారాయణ స్వామి కొలువై వుంటారు.
పాదాల భాగంలో చేప మాదిరి ఉండటంతో ఇక్కడ పరమాత్ముని పాద దర్శనం లభించదు ఇక్కడ.
క్షేత్ర అమ్మవారు " శ్రీ వేద వల్లి" ప్రత్యేక సన్నిధిలో భక్తులకు దర్శనమిస్తారు.
ప్రస్తుతం తిరుమల తిరుపతి దేవస్థానం అధీనం లో ఉన్న ఈ ఆలయం బాగా అభివృద్ధి చెందినది.

ప్రతినిత్యం శ్రీ వైష్ణవ సాంప్రదాయం ప్రకారం నిర్ణయించబడిన పూజలు మూల విరాట్టుకు జరుగుతాయి.
ప్రతి సంవత్సరం మార్చి నెల ఇరవై ఏడు నుండి మూడు రోజుల పాటు వరసగా సాయం సంధ్యా సమయంలో సూర్య కిరణాలు తొలి రోజున పాదాల మీద, రెండో రోజున నాభి మీద మూడో రోజున ముఖ కమలం మీద పడతాయి.
ఎంతో లోపలి ఉండే గర్భాలయంలోని స్వామి వారి మీద ఇలా ఆదిత్యుని కిరాణాలు పడటంలో నాటి శిల్పుల నిర్మాణ కౌశలాన్ని ప్రశంసించాలి.
వైకుంఠ ఏకాదశి, ధనుర్మాస పూజలు, రధ సప్తమి, ఆండాళ్ నేత్రోత్సవం ఇతర హిందూ పర్వదినాలను వైభవంగా జరుపుతారు.
శ్రీ వేద నారాయణ స్వామి బ్రహ్మోత్సవాలు ప్రతి సంవత్సరం జేష్ఠ మాసం ( మే - జూన్ )లో నిర్వహిస్తారు.
దగ్గరలోని అడవి సుందర జలపాతాలకు , సాహస వన యాత్రలకు ప్రసిద్ది చెందినది.
నాగలా పురానికి తిరుపతి నుండి బస్సు సౌకర్యం లభిస్తుంది.
శ్రీనివాసం అతిధి గృహం నుండి చుట్టు పక్కల ఉన్నఆలయ దర్శనానికి ప్రత్యేక బస్సు ఏర్పాటు చేయబడినది.
చక్కని శిల్ప సంపదతో కూడిన అరుదైన చారిత్రిక ప్రాధాన్యత కలిగిన అద్భుత ఆలయం నాగలా పురం శ్రీ వేద నారాయణ స్వామి ఆలయం. 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...