21, ఆగస్టు 2013, బుధవారం

Sri Ayyappan Guru- sri Gurunathan, Pandalam


                   శ్రీ అయ్యప్పన్ గురు - శ్రీ గురునాధన్ 






శ్రీ పరశురాముడు కొంకణ్ భూ భాగాన్నిసముద్రుని నుండి తీసుకున్నప్పుడు క్షేత్ర పాలకునిగా మహేశ్వరుని, క్షేత్ర కావలి దేవతగా శ్రీ భగవతి అమ్మన్ ను, క్షేత్ర రక్షకునిగా శ్రీ ధర్మ శాస్తాను నిర్ణయించారట.















అక్కడితో ఆగక నూట ఎనిమిది చొప్పున శివాలయాలు, భగవతి, శ్రీ ధర్మ శాస్త ఆలయాలు కూడా నిర్మించి, నిత్య పూజాదికాలు జరిపించడానికి కర్ణాటక నుండి వేదవేదాంగ పారంగాతులైన బ్రాహ్మణులను రప్పించి నియమించారట. 
భువిలో ధర్మాన్ని రక్షించడానికి స్థితి లయ కారకులకు జన్మించిన శ్రీ ధర్మ శాస్త తరువాత కూడా అవసరం ఏర్పడినప్పుడల్లా అవతారాలు ధరించాడని పురాతన మలయాళ గ్రంథాల ఆధారంగా తెలుస్తోంది. 
అలాంటి వాటిల్లోనిదే శ్రీ మణి కంట స్వామి అవతారం ఒకటి. 
లోకాలను అల్ల కల్లోలం చేస్తున్న మహిషిని అంతమొందించడానికి పసి బాలకునిగా రాజుకి లభించిన మణి కంటుడు పందలంలో పెరిగాడు. 
ప్రజలను రక్షించడానికి, రాజ్య పాలనకు కావలసిన అన్ని విద్యలను నేర్పగల గురువు కొరకు రాజు అన్వేషించారు. 
ఆ సమయంలో శివ చైతన్య అంశతో జన్మించిన మహా యోగి శ్రీ గురునాధాన్, శివాజ్ఞాతో వచ్చారట. వారిని చూసిన రాజు అమితానందించి ఆయనను పుత్రునికి గురువుగా నియమించారట. 
శ్రీ గురునాధాన్ పందలంలో అచ్చన్ కొయిల్ నది ఒడ్డున చిన్న కొండ మీద గురుకులాన్ని ఏర్పాటు చేసారు. 
గురువు దగ్గర సామాన్యుని మాదిరి శుశ్రూషలు చేసి విద్యను అభ్యసించారు అవతారమూర్తి. 
గురు దక్షిణగా మూగ, చెమిటి వాడైన గురు కుమారునికి వినికిడి శక్తిని, వాక్కును ప్రసాదించారు కారణ జన్ముడు. 
ఈ సంఘటనలన్నీ జరిగినది పందళం రాజ మహల్ కి దరిదాపులలో అచ్చన్ కోవిల్ నదికి అటు ప్రక్కన ఉన్న కులనాడ లోనే !!!
అప్పట్లో గురుకులం ఇక్కడే ఉండేది. చిన్న కొండ మీద ఉన్న ఈ స్థలం అద్భుత ప్రకృతి సౌందర్యానికి మరో పేరు. 
చుట్టూ పర్వతాలు, లోయలు, గలగల పారే నది, రబ్బరు, అరటి తోటలు, ప్రశాంతతకి నిలయం ఈ గురుకులం. 
కారణ జన్ముడు మణి కంట స్వామి శివాంశ సంభూతుని వద్ద విద్య నేర్చుకొన్న పవిత్ర స్టలాన్ని ప్రస్తుతం ఒక ఆలయం గా మార్చారు.  













సర్వ విద్యలకే గురువైన స్వామికి గురువైన శ్రీ గురునాధాన్ తో పాటు శిష్యునికి, అతని జన్మకు కారకులైన విష్ణు మరియు పరమేశ్వరునికి, సోదరుడు విఘ్న నాయకునికి ఆలయాలు నిర్మించారు. 
ఉప ఆలయాలలో శ్రీ వీర భద్రుడు, నాగరాజు మరియు నాగ యక్షిని ఉంటారు. 














రాజగోపురం, ఆకర్షించే శిల్పాలు, ధ్వజస్థంభము ఉండవు. కానీ మహనీయులు సంచరించిన స్థలం అయినందున ఒక పవిత్ర వాతావరణాన్ని ప్రతిబింబిస్తుంది. 
అందుకే స్థానికంగా శ్రీ గురునాధన్ ముకాడి లేదా శ్రీ గురునధాన్ క్షేత్రం అని పిలుస్తారు. 
ప్రతి నిత్యం ఇక్కడ వెలసిన దేవీ దేవతలందరికీ వివిధ రకాల పూజలు జరుపుతారు. 
శ్రీ అయ్యప్పకు తొమ్మిది, శ్రీ హరికి ఐదు, సర్వేశ్వరునికి ఎనిమిది, దేవి కి నాలుగు, మిగిలిన వారికి అందరికి కలిపి పది రకాల పూజలు, అభిషేకాలు, అర్చనలు, నైవేద్యాలు విధిగా జరుపుతారు. 
నిత్య పూజలే కాకుండా ప్రత్యేక హోమాలు, అర్పణలు, ఆరగింపులు కూడా ఉన్నాయి. 
ప్రతి సంవత్సరం వృచ్చిక మాసం ( నవంబరు-డిసెంబరు ) ఒకటో రోజున ఆరంభించి మకర సంక్రాంతి దాకా అత్యంత వైభవంగా చెరుప్పు ని నిర్వహిస్తారు. ఆఖరి రోజున పందల కన్నిక్కమండపం నుండి ఇక్కడిదాకా పెద్ద ఊరేగింపుగా వెళతారు. ఈ ఊరేగింపును వరవేలుపుగా  పిలుస్తారు. ఈ రోజునే 
మణి కంటుడు తొలిసారి రాజ ప్రాసాదం నుండి గురుకులానికి తరలి వెళ్ళారని అంటారు. 
ప్రతిష్టా మహోత్సవం, ఆలయ నిర్మాణ ఉత్సవం, సర్ప పూజ కూడా భారి ఎత్తున భక్తుల విరాళాలతో జరుపుతారు. 
శబరిమల వెళ్ళే యాత్రీకులందరూ ఒక్క సారి శ్రీ గురునాధాన్ ముఖాడిని తప్పనిసరిగా దర్శించాలి. 
పందాలం బస్సు స్టాండ్ లేదా రాజ మందిరం నుండి అయిదు కిలో మీటర్ల దూరంలోగురువులకు గురువైన శ్రీ అయ్యప్ప స్వామి గురు దేవులైన  శ్రీ గురునాధాన్ ముఖాడి ఉంటుంది. 


స్వామియే శరణం అయ్యప్ప !!!!







కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...