5, జనవరి 2012, గురువారం

thiruvellarai



     శ్రీ పుండరీకాక్ష పెరుమాళ్ ఆలయం, తిరువెళ్ళరాయి 


నూట ఎనిమిది శ్రీ వైష్ణవ దివ్యదేశాలలో అగ్రస్థానంలో ఉండి భూలోక వైకుంఠంగా కీరించ బడుతున్నది శ్రీ రంగనాధుడు కొలువైన శ్రీ రంగం. కొల్లిడం మరియు కావేరి నదుల మధ్యలో త్రేతాయుగంలో శ్రీ రంగ విమానం శ్రీ రంగంలో స్థిరపడినది అని పురాణ గాధలు తెలుపుతున్నాయి
ఈ దివ్య క్షేత్రానికి చుట్టుపక్కల ఉన్న మరికొన్ని దివ్య తిరుపతులలో శ్రీ రంగం కన్నా ముందు నుండి అనగా కృతయుగం నుండి ఉన్నదన్న ఆధారాలు కలిగిన క్షేత్రం తిరువెళ్ళరాయి. 
అసంకల్పితంగా విధాత చేసిన పొరబాటుకు ఆగ్రహించిన లయకారుడు పరమ శివుడు ఆయన అయిదవ శిరస్సును తన చేతి వేలి గోరుతో ఖండించారట. 
తిరుఖండియూర్ అనే దివ్య దేశంతో ముడిపడి ఉన్న గాధ కూడా ఇదే !
అలా ఖండించడం వలన మహేశ్వరినికి బ్రహ్మ హత్య పాతకం చుట్టుకోవడమే కాకుండా బ్రహ్మ శిరస్సు ఆయన చేతికి అంటుకొని పోయిందట. దానిని ఎలా తొలగించుకోవాలో అన్న తరుణోపాయానికి కైలాసనాధుడు, తెలియక చేసిన పొరబాటుకు వగచి పరిహారం కోసం వాణీ పతి ఇరువురూ ఈ క్షేత్రంలో శ్రీ మన్నారాయణుని ప్రార్ధించారట. 
సాక్షాత్కరించిన శ్రీ హరి పరమేశ్వరునికి సంక్రమించిన దోషం తొలగిపోవడానికి మార్గాన్ని తెలిపారట. బ్రహ్మదేవునికి అంటుకున్న పాపం శిరస్సు ఖండించడంతో తొలగిపోయిందని చెప్పి వారి కోరిక మేరకు అక్కడ అర్చా రూపంలో స్థిరపడ్డారట. 
మరో కధనం ప్రకారం శ్రీ మహా విష్ణువు పాలకడలి నుండి ఉద్భవించిన సముద్రరాజ తనయతో తన వివాహం జరిగిన సందర్భంగా నూతన వధువుకి వరం అనుగ్రహించారట. శ్రీ మహాలక్ష్మి తనకు స్వామి వక్షస్థలంలో శాశ్విత స్థానం కోరుకొన్నదట. శ్రీ విష్ణు మూర్తి ఆమె ను ఆ స్థానం పొందటానికి భూలోకంలోని శ్వేత గిరి వద్ద తపస్సు చేయమని సలహా ఇచ్చారట. ఆమె అలా చేసి స్వామివారి వక్షస్థలంలో స్థిర నివాసం ఏర్పరచుకొన్నది. తిరువెళ్ళరాయి ఆలయం లో ప్రధాన ప్రాధాన్యత అమ్మవారైన శ్రీ సెంపకవల్లి(పంకజవల్లి) దే ! ఊరేగింపులో ముందు అమ్మవారి పల్లకీ వెళుతుంటే వెనక స్వామివారి పల్లకీ వెళుతుంది. ఇలాంటి విశేషమే మరో రెండు దివ్య క్షేత్రాలలో   కనపడుతుంది. అవి నాంచారి కోవెల మరియు శ్రీ విల్లిపుత్తూర్.  . 







అనంతర కాలంలో శిబి చక్రవర్తి తన పరివారంతో ఈ మార్గంలో వెళుతూ ఇక్కడ విడిది చేశారట. 
మంత్రి సామంతులతో చర్చిస్తున్న శిబి చక్రవర్తి ముందు నుండి ఒక శ్వేత వరాహం వెళ్లిందట. వరాహం అందులో తెల్ల రంగులో ఉన్నది మానవులను చూసి బెదరకుండా మధ్య నుండి వెళ్లడం వారిని ఆశ్చర్య పరిచిందట. 
దానిని అనుసరిస్తూ వెళ్లగా ఆ వరాహం ఒక కలుగు లోనికి వెళ్లిపోయిందట. కలుగును తొలచమని సైనికులకు చక్రవర్తి ఆదేశించారట. కానీ పక్కనే ఉన్న గుహలో తపస్సు చేసుకొంటున్న మార్కండేయ మహర్షి వెలుపలకి వచ్చి ఆ కలుగును గోక్షీరం(ఆవు పాలు)తో నింపని చెప్పారట. 
పాల ధారలతో మట్టి మెత్తబడి కలుగు క్రిందకి కృంగిపోవడంతో లోపల ఉన్న శ్రీ మహావిష్ణు శిలా రూపం నేత్రపర్వంగా దర్శనమిచ్చినదట. 
శిబి చక్రవర్తి లభించిన అదృష్టానికి పరవశించి తదుపరి జరపవలసిన దాని గురించి  మార్కండేయ మహర్షిని సంప్రదించారట. ఆయన చెప్పినదాని ప్రకారం వేలాది మంది వేద విద్యా కోవిదులను రప్పించి వారి సలహా సంప్రదింపులతో ఆలయ నిర్మాణం చేశారట. విగ్రహ ప్రతిష్ట జరిగిన సమయంలో శ్రీమన్నారాయణుడు సాక్షాత్కరించి శిబి చక్రవర్తి, మార్కండేయ మహర్షిని ఆశీర్వదించి చక్రవర్తి తో తాను అతని వంశంలో జన్మించి దుష్ట సంహారం జరిపి లోకకల్యాణం చేస్తానని వరం ఇచ్చారట. 
ఆ వరం కారణంగా ఇక్ష్వాకు వంశంలో శ్రీ రామచంద్రునిగా జన్మించి రావణాది రాక్షస సంహారం చేసారు. 








శిబి చక్రవర్తి శ్రీ పుండరీకాక్ష పెరుమాళ్ ఆలయాన్ని చిన్న తెల్లని రాళ్లతో నిండిన కొండ మీద నిర్మించడం వలన దీనిని "శ్వేత గిరి" అని పిలిచేవారు. అదే కాల గతిలో "తిరువెళ్లరాయి" (తిరు - శ్రీ, వెళ్ళరాయి - తెల్లని రాయి) అనే తమిళ నామం లోనికి మారింది. 

ఆలయ చరిత్ర 

యాభై అడుగుల ఎత్తు గల గుట్ట మీద నిర్మించిన ఆలయ రాజ ద్వారాన్ని చేరుకోడానికి పద్దెనిమిది సోపానాలు మార్గం ఉంటుంది. ఈ మెట్లను పంచేంద్రియాలకు, కామ, క్రోధ, లోభ,మోహ,మద మాత్సర్యాలకు, అసూయ, డాంబికం, త్రిగుణాలకు, విద్య మరియు అవిద్యలకు సంకేతాలుగా పేర్కొంటారు. 
బలి పీఠం  దగ్గర గల నాలుగు మెట్లను నాలుగు వేదాలకు సూచనగా చెబుతారు. గర్భాలయం  చేరుకోడానికి మరో అయిదు మెట్లు ఉంటాయి. వాటిని నీరు, నిప్పు, నేల, నింగి, గాలి గా పిలవబడే పంచ భూతాలకు నిదర్శనంగా భావిస్తారు. తరువాత ఉండే ఎనిమిది మెట్లను "ఓం నమో నారాయణాయ " అనే అష్టాక్షరీ మంత్రానికి ప్రతీకగా పరిగణిస్తారు. ఆ తరువాత వచ్చే ఇరవై నాలుగు మెట్లను గాయత్రీ మంత్రంలోని బీజాక్షరాలతో పోలుస్తారు. 
అంతే కాదు తిరువెళ్ళరాయి ఆలయంలో మరో విశేషం కూడా కలదు. అది గర్భాలయానికి దారితీసే మండపానికి రెండు ద్వారాలు ఉంటాయి.ఒకటి ఉత్తరాయణ వాసల్ మరొకటి ద్దక్షిణాయన వాసల్. ఒక ఆరు నెలలు ఒక ద్వారం నుండి మరో ఆరు నెలలు రెండో వాకిలి నుండి ప్రవేశించాలి. ఈ ద్వారాల కారణంగా శ్రీ పుండరీకాక్ష పెరుమాళ్ ని దక్షిణాయనంలో "మాయావన్" అని, ఉత్తరాయణంలో "తాయ్ మాత నాయగన్" అని పిలుస్తారు.  
మరో సిద్ధాంతం ప్రకారం ఈ రెండు ద్వారాలు మానవ జీవితాలలో తప్పని చావు పుట్టుకలకు అనగా జన్మజన్మలకు నిదర్శనంగా పేర్కొంటారు. 








ప్రస్తుత ఆలయాన్ని పల్లవ రాజులు ఆరు నుండి ఏడవ శతాబ్దాల మధ్య కాలంలో కట్టించినట్లుగా చరిత్ర కారులు నిర్ధారించారు. దేనికి ప్రమాణంగా ఆలయంలో ప్రాంగణంలోని రెండు సహజసిద్ధ గుహలలో ఉన్న పల్లవ రాజులైన రెండవ నందివర్మ మరియు దంతివర్మ వేసిన ఎనిమిదో శతాబ్దపు శాసనాలను చూపిస్తారు. వీరి రాజవంశ చిహ్నాలైన నారసింహ మరియు వరాహలు ఆలయ గోడల పైన కనిపిస్తాయి. 
పల్లవుల తరువాత పాండ్యులు, చోళులు, హొయసల, విజయనగర మరియు నాయక రాజులు ఆలయాభివృద్దికి తమ వంతు కైకార్యాలను సమర్పించుకొన్నట్లుగా ఆలయంలోని శాసనాల ద్వారా తెలియవస్తుంది. 
ఆలయ ప్రధాన ప్రవేశ ద్వారం వద్ద నిర్మించిన రాజగోపురం అసంపూర్ణంగా ఉంటుంది.  గోపురానికి అనుసంధానంగా ప్రాంగణాన్ని కలుపుతూ ఎత్తైన ప్రహరీ గోడ నిర్మించారు. చూడగానే ఒక పెద్ద కోట గోడలాగా కనిపిస్తుంది. రెండో ప్రాకారానికి వెళ్లే ద్వారానికి ఒక చిన్న గోపురం కనపడుతుంది. అన్నిటికన్నా వెలుపల ఉన్న మాడ వీధితో కలిపి  ఆలయానికి మొత్తం అయిదు ప్రాకారాలు ఉన్నాయి. 
రెండో ప్రాకారంలో గుహాలయాలు మరియు వసంత మండపం ఉంటాయి. ఒక గుహలో కైలాసనాధుడు లింగరూపంలో దర్శనమిస్తారు. స్వామిని "వడ జంబునాథర్" అని పిలుస్తారు.  మూడో ప్రాకారంలో అమ్మవారు, ఆండాళ్, ఆంజనేయ, గరుడ, శ్రీ లక్ష్మీనారసింహ మరియు శ్రీ చక్రత్తియాళ్వార్ ఉపాలయాలలో కొలువై దర్శనమిస్తారు. ఈ ప్రాంగణంలోనే భక్తులు అతి పవిత్రంగా భావించే బలిపీఠం ఉంటుంది. భక్తులు తమ కోర్కెలను ఇక్కడే విన్నవించుకొంటారు. అవి నెరవేరిన తరువాత బలిపీఠానికి జలంతో అభిషేకం జరిపి, పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి, పాయసాన్ని నివేదన చేస్తారు. ఇక్కడ విన్నవించుకున్న కోర్కెలు నెరవేరక పోవడం లేదని భక్తుల విశ్వసిస్తారు. 
శ్రీ కృష్ణ,విశ్వక్సేన, నమ్మాళ్వార్. తొందరడిప్పొడి ఆళ్వార్, రామానుజులు. మానవల మహాముని, నాదముని, కులశేఖర ఆళ్వార్ కూడా ఉపాలయాలలో దర్శనమిస్తారు. 
శ్రీ వైష్ణవ గురువు శ్రీ రామానుజా చార్యులు వారు తిరువెళ్ళరాయి క్షేత్రాన్ని సందర్శించి శ్రీ పుండరీకాక్ష పెరుమాళ్ ని సేవించుకొని కొంతకాలం ఇక్కడ ఉన్నారని చెబుతారు. శ్రీ వైష్ణవ సిద్ధాంతాన్ని అనుసరించే వారిలో తిరువెళ్ళరాయి సందర్శన మోక్ష దాయకం అన్న విశ్వాసం ఉన్నది. 






నలికేట వాసల్ గుండా రెండో ప్రకారం లోనికి ప్రవేశిస్తే అక్కడ   చేరుకోడానికి ఉత్తరాయణ, దక్షిణాయన ద్వారాలు కనపడతాయి. 

నలికేట వాసల్ 

తిరువెళ్ళరాయి క్షేత్రంలో అమ్మవారిదే పెత్తనం అని చెప్పుకొన్నాము కదా ! దానికి మరో నిదర్శనం ఈ నలికేట వాసల్. ఉత్సవాల సందర్బంగా స్వామి వారు అమ్మవారు నగర సంచారం చేస్తారు. అమ్మవారు ముందుగా ఆలయానికి చేరుకొంటారు. కానీ స్వామివారు వెనక రావడం లేదా ఎక్కడైనా భక్తులు ఆపితే ఆగిపోవడం లాంటి వాటి వలన ఆలస్యంగా చేరుతారు. 
అమ్మవారు కొంచెం కోపంగా స్వామిని ఈ గుమ్మం దగ్గిర ఆపి ఆలస్యానికి కారణం అడుగుతారు. ఇక్కడే ఆయన తన ఆలస్యానికి కారణాలను అమ్మవారికి తెలుపుతారు. ఆమె సంతృప్తి చెందిన తరువాతే స్వామి ఆలయం లోనికి ప్రవేశించగలుగుతారు. 
నేటికీ ఉత్సవాల సందర్బంగా అర్చక స్వాములే ప్రధాన పాత్రలు పోషిస్తూ నిర్వహించే ఈ సన్నివేశం తప్పక  చూడవలసినదే !
గర్భాలయంలో మూలవిరాట్టు శ్రీ పుండరీకాక్ష పెరుమాళ్ స్ధానక భంగిమలో దర్శనమిస్తారు. పద్దెనిమిది అడుగుల ఎత్తైన విగ్రహ రూపంలో ఎడమచేతిలో శంఖాన్ని, కుడి చేతిలో సుదర్శన చక్రాన్ని శత్రువుల మీదకు ప్రయోగించే విధంగా పట్టుకొని కనిపిస్తారు. చక్కని పుష్ప మాలలతో, స్వర్ణాభరణ శోభితులుగా దర్శనమిచ్చే శ్రీ పుండరీకాక్ష పెరుమాళ్ రూపం భక్తుల హృదయాలలో స్థిరంగా నిలిచిపోతుంది. 
అర్చామూర్తికి ఇరువైపులా సూర్య చంద్రులు వింజామర వీస్తూ కనిపిస్తారు. పాదాల చెంత మార్కండేయ మహర్షి మరియు శ్రీ భూదేవి ఉంటారు. పక్కనే అయిదు పడగలతో నమస్కార భంగిమలో స్వామివారి పాన్పు అయిన ఆదిశేషువు స్థానక భంగిమలో కనిపించడం ఒక అరుదైన విశేషం. స్వామివారి వాహనమైన గరుత్మంతుడు ఆది శేషువు పక్కన నిలబడి ఉంటారు. 
గర్భాలయ వెలుపలి గోడలపైన సున్నంతో నిర్మించబడిన శ్రీమన్నారాయణుని రూపాలు నేటికీ సుందరంగా కనిపిస్తాయి. వీటిని మదురై నాయక రాజులు ఏర్పాటు చేశారు అని తెలుస్తోంది. 
అమ్మవారు శ్రీ పంకజ వెళ్లి ప్రత్యేక సన్నిధిలో ఉపస్థిత భంగిమలో కొలువై ఉంటారు. 
తిరువెళ్ళరాయి ఆలయంలో నాటి నిర్మాణ చాతుర్యాన్ని తెలిపే ఒక విశేషం కనిపిస్తుంది. అమ్మవారి సన్నిధి వద్ద గోడకు ఉన్న రంధ్రం గుండా చూస్తే అక్కడికి ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్న శ్రీ రంగనాథ స్వామి మరియు శ్రీ జంబుకేశ్వర స్వామి ఆలయ గోపురాలు కనిపిస్తాయి. ఎంత  నేర్పరులో కదా నాటి శిల్పులు !
ఆలయ గోడలపైన రామాయణ, భాగవత పురాణాలలోని ముఖ్య ఘట్టాలను సహజసిద్ధ వర్ణాలతో చిత్రించారు. ఇవి విజయనగర మరియు నాయక రాజుల కాలాల నాటివిగా తెలుస్తోంది. వీటి మీద తెలుగు అక్షరాలతో వివరాలు రాసి ఉండటం విశేషం. 
ఆలయంలో ఉన్న ఒక పెద్ద స్థంభం మీద తట్టితే ఆ శబ్దం ఆలయ ప్రాంగణంలో ప్రతిధ్వనిస్తుంది. 

గుహాలయాలు 

చిన్న గుట్ట మీద నిర్మించబడిన శ్రీ పుండరీకాక్ష పెరుమాళ్ ఆలయానికి పక్కన మూడు గుహాలయాలు కనిపిస్తాయి. ఒక దానిలో మార్కండేయ మహర్షి తపస్సు చేశారని చెబుతారు. మరో దానిలో శ్రీ మహాలక్ష్మి కొలువై ఉంటారు. పల్లవ రాజుల కాలం నాటి శాసనాలు ఈ గుహాలయాలలో కనిపిస్తాయి. 
మూడో గుహ ఆలయానికి వెనుక ఇంకొంచెం ఎత్తులో ఉంటుంది. దానిలో శ్రీ ఆది జంబుకేశ్వర  లింగ రూపంలో దర్శనమిస్తారు. ఆ విధంగా తిరువెళ్ళరాయి శివ కేశవ క్షేత్రంగా పేర్కొనబడుతున్నది. 
 

ఆలయ పుష్కరిణులు 

సుమారు మూడు ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ప్రాంగణంలో ఏడు కోనేరులు కనిపిస్తాయి. వీటిని దివ్య, కంద క్షీర, చక్ర, పుష్కల, పద్మ, వరాహ మరియు మణికర్ణికా తీర్థాలుగా పిలుస్తారు. 
ఇవి కాకుండా మరో విశేష మరెక్కడా కనపడని స్వస్తిక్ తీర్థం తిరువెళ్ళరాయిలో కనపడుతుంది. 

స్వస్తిక్ తీర్థం 

మరే ఇతర ఆలయాలలో కనిపించని స్వస్తిక్ పుష్కరణి తిరువెళ్ళరాయి ఆలయంలో ఉన్న మరో ఆకర్షణ.  ప్రస్తుతం పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్న ఈ తీర్థం ఒక విశిష్ట నిర్మాణం.  దీనిని అత్తా కోడళ్ల (మమ్మియార్ - మాట్టు పెన్ )తీర్థం లేదా చక్ర తీర్థం అని కూడా పిలుస్తారు. 
ఎనిమిదవ శతాబ్దంలో నిర్మించబడిన ఈ తీర్థం ప్రత్యేకత ఏమిటంటే ఒక పక్క స్నానం చేస్తున్నవారు రెండో పక్క స్నానం చేస్తున్నవారిని చూడలేరు. లోపలి దిగడానికి మెట్ల మార్గం ఉంటుంది. పుష్కరణి ఒడ్డున శివ లింగాలు, నంది, నాగప్రతిష్ఠలు కనపడతాయి. 
పల్లవ రాజులు కట్టించిన ఈ స్వస్తిక్ పుష్కరిణికి  హొయసల రాజులు పదమూడవ శతాబ్దంలో మరమత్తులు చేయించినట్లుగా తెలుస్తోంది. 
అత్యంత అరుదైనది ఈ స్వస్తిక్ పుష్కరణి. 




 


ఉదయం ఆరు గంటల నుండి మధ్యాహన్నం ఒంటి గంట వరకు తిరిగి సాయంత్రం నాలుగు నుండి రాత్రి ఎనిమిది గంటల వరకు తెరిచి ఉండే ఈ ఆలయంలో ప్రతి నిత్యం ఆరు పూజలు నియమంగా  జరుగుతాయి. 
అష్టమి, ఏకాదశి రోజులలో విశేష పూజలు నిర్వహిస్తారు. వైకుంఠ ఏకాదశి, శ్రీరామ నవమి, కృష్ణాష్టమి, ధనుర్మాస పూజలు ఘనంగా నిర్వహిస్తారు. వారానికి, పక్షానికి మాసానికి ఒకసారి ప్రత్యేక
పూజలు మూలవరులకు జరుపుతారు.  
ఆలయ బ్రహ్మోత్సవాలను ఫాల్గుణ మాసంలో రంగరంగ వైభవంగా చేస్తారు. ఈ ఉత్సవాల సందర్బంగా ఏర్పాటు చేసే రధోత్సవం కన్నుల పండుగగా ఉంటుంది అంటారు. విచ్చేసిన భక్తులకు అన్నప్రసాదాలు అందించడం మరో విశేషం. 
ఇవే కాకుండా చైత్ర పౌర్ణమికి నిర్వహించే ఉత్సవాలు కూడా పెద్ద సంఖ్యలో భక్తులను  ఆకర్షిస్తాయి. 
పన్నిద్దరు శ్రీ వైష్ణవ ఆళ్వారులలో పెరియాళ్వార్ పదకొండు పాశురాలతో, తిరుమంగై ఆళ్వార్ పదమూడు పాశురాలతో శ్రీ పుండరీకాక్ష పెరుమాళ్ ని కీర్థించారు. ఈ కారణంగా తిరువెళ్ళరాయి దివ్యదేశాల జాబితాలో శాశ్వత స్థానం సంపాదించుకున్నది. 
విశిష్టాద్వైత సిద్ధాంత కర్త ప్రముఖ శ్రీ వైష్ణవ ఆచార్యులు అయిన శ్రీ శ్రీ శ్రీ రామానుజాచార్యులు తిరువెళ్ళరాయి సందర్శించి, కొంతకాలం శ్రీ పుండరీకాక్ష పెరుమాళ్ సేవలో గడిపారట. 
ఎన్నో ప్రతేకతలకు నిలయమైన తిరువెళ్ళరాయి దివ్య క్షేత్రం తిరుచునాపల్లికి సుమారు ఇరవై కిలోమీటర్ల దూరంలో ఉన్నది. వసతి సౌకర్యాలు లభించవు. కనుక తిరుచునాపల్లి నుండి వెళ్లి రావడం ఉత్తమం. 
జై శ్రీమన్నారాయణ !!!!






 

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

Sri Bala Koteswara Swami Tempe, Govada,

                 శ్రీ బాల కోటేశ్వర స్వామి ఆలయం , గోవాడ  చుట్టూ పచ్చని పొలాలు. ఎటు చూసినా కళ్ళ ముందు నిర్మలమైన ఆకుపచ్చని ప్రకృతి. ఆహ్లాదం కలి...