Saturday, April 15, 2017

Sri Varadaraja Perumal Temple, Kanchipuram


          శ్రీ వరదరాజ పెరుమాళ్ ఆలయం, కాంచీపురం 

కాంచీపురం లో నెలకొన్న అనేకానేక దేవాలయాలలో ప్రముఖమైన వాటిల్లో మొదటిది శ్రీ వరద రాజ పెరుమాళ్ కోవెల. గతంలో వెయ్యికి పైగా దేవాలయాలు కంచి లో ఉండేవని చెబుతారు. 
శ్రీ వైష్ణవులకు పరమ పవిత్రమైన నూట ఎనిమిది దివ్య దేశాలలో ఒకటి ఈ ఆలయం. అంతే కాదు శ్రీరంగం, తిరుమల, మేల్కేటే ల తరువాత కంచి శ్రీ వరద రాజ పెరుమాళ్ కోవెల వారికి అత్యంత పవిత్ర దర్శనీయ క్షేత్రం. 
మరో విశేషం ఏమిటంటే ఈ నూట ఎనిమిది దివ్య తిరుపతులలో పదునాలుగు కంచి లోనే ఉండటం. 
అందులో కొన్ని విష్ణు కంచిలో ఉండగా మరి కొన్ని శివ' కంచి ఉంటాయి. 
విష్ణు కంచి లో ఉండే శ్రీ వరద రాజ పెరుమాళ్ కోవెల ఎంతో విశేష పౌరాణిక మరియు చారిత్రక 
నేపథ్యం కలిగి ఉంటుంది. 


కృతయుగంలో విధాత బ్రహ్మ, త్రేతాయుగంలో గజరాజు గజేంద్రుడు , ద్వాపర యుగంలో బృహస్పతి, కలియుగంలో ఆది శేషుడు ఈ స్వామిని సేవించారు అని పురాణాలు పేర్కొంటున్నాయి.
స్వామి ఇక్కడ స్వయంభూగా వెలయడం గురించిన కదా సత్యయుగం నాటిదిగా తెలుస్తోంది.
సరస్వతీ దేవితో ఏర్పడిన వివాదంతో ఆగ్రహించి భూలోకానికి వచ్చిన సృష్టి కర్త శ్రీ మహా విషు అనుగ్రహం కోసం అశ్వమేధ యాగం తలపెట్టారు.
కాకపోతే యజ్ఞ దీక్షలో సతీసమేతంగా కూర్చోవాలి అందుకని శ్రీ గాయత్రీ దేవిని కూర్చోబెట్టుకొని యాగం ఆరంభించారు. ఈ పరిణామానికి ఆగ్రహించిన సరస్వతీ దేవి నదీ రూపంలో  ఉదృతం వేగంతో ప్రవహిస్తూ యజ్ఞ వాటికను ముంచివేయబోగా శ్రీ హరి అడ్డుగా శయనించి ప్రవాహాన్ని పక్కకు మళ్లించారు. ఆలా శయనించిన ప్రదేశంలో మరో దివ్య దేశం ఉన్నది అదే "తిరువెక్క" ఈ ఆలయానికి దగ్గరలోనే ఉంటుంది.


విధాత యాగాన్ని నిర్విఘ్నంగా పూర్తిచేసుకున్న తరువాత శ్రీ మన్నారాయణుడు దర్శనమిచ్చి ఆలుమగల మధ్య వివాదాలు సహజమని తెలిపి సృష్టి కర్తను చదువుల తల్లిని కలిపారు.
అంతట పద్మాసనుడు, దేవతలు, మునులు స్వామిని ఇక్కడే స్థిరనివాసం ఏర్పరచుకోమని ప్రార్ధించారు.
అలా స్వామి ఇక్కడ కొలువుతీరారు.
త్రేతాయుగంలో గజేంద్రుడు ప్రతి నిత్యం సమీపంలోని పుష్పాలను సేకరించి స్వామిని పూజించేవాడు. ఇతను గత జన్మలో భరత మహారాజ పుత్రుడైన "ఇంద్రద్యుమ్ము"నిగా కొన్ని గ్రంధాలూ పేర్కొన్నాయి. అగస్త్య మహర్షి శాపకారణంగా ఈ జన్మలో ఏనుగుగా జన్మించాడు.
గజేంద్ర మోక్షం గాద  మనందరకూ తెలిసినదే!
మొసలి బారి నుండి రక్షించిన ఆదిదేవుని కరిరాజు మోక్షాన్ని అర్ధించడమే  కాకుండా  తన శరీరం మీద కొలువై ఉండమని కోరాడు.
అందుకని ఈ క్షేత్రాన్ని "హస్తిగిరి " అని పిలుస్తారు. అదే కాలక్రమంలో "అత్తిగిరి"గా మారిందని కొందరు  ఒకప్పుడు ఈ ప్రాంతమంతా అత్తి వృక్షాలతో నిండి ఉన్నందున ఈ పేరు వచ్చింది అని మరికొందరు అంటుంటారు.
గాయక భక్తులైన ఆళ్వారులు తమ పాశురాలలో ఈ క్షేత్రాన్ని "అత్తియూరు" అని పేర్కొన్నారు.
సుమారు ఇరవై అయిదు ఎకరాల స్థలంలో ఉండే ఈ ఆలయాన్ని తొలుత కంచిని పాలించిన పల్లవ  రాజు రెండవ నందివర్మ క్రీస్తు శకం ఎనిమిదో శతాబ్దంలో నిర్మించినట్లుగా తెలుస్తోంది.(కంచి లోని చాలా ఆలయాలు ఈయన నిర్మించినవే కావడం విశేషం) తరువాత చోళ రాజులు పూర్తిస్థాయిలో అభివృద్ధి చేశారని శాసనాలు తెలుపుతున్నాయి. మరెన్నో రాజవంశాలు ఆలయానికి తమ వంతు కర్తవ్యంగా కైకర్యాలు సమర్పించుకున్నారు.
కానీ విజయనగర రాజుల కాలంలో పెక్కు నిర్మాణాలు జరిగి ప్రస్తుత రూపాన్ని సంతరించు కొన్నదీ కోవెల.
  మొత్తం మూడు ప్రాకారాలతో,  ముప్పై రెండు ఉపాలయాలు, పంతొమ్మిది విమాన గోపురాలు, మూడువందల పైచిలుకు మండపాలతో  శోభాయమానంగా ఉంటుంది.
అద్భుతమైన శిల్పకళ ఈ ఆలయ సొంతం. ముఖ్యంగా అనంత పుష్కరణి పక్కన ఉండే వంద స్తంభాల మండప శిల్ప శోభా వర్ణించ శక్యం కాదు. ఒకే రాతితో చెక్కిన గొలుసులు, కూర్మ సింహాసనానికి దిగువన అమర్చిన తిరిగే చక్రాలు, స్థంభాలకి చెక్కిన రామాయణ, మహా భారత సన్నివేశాలు మహాద్భుతంగా ఉంటాయి.ముఖ్యంగా సందర్శించవలసిన ఉపాలయాలలో శ్రీ నారసింహ, శ్రీ రామానుజ, ఆళ్వారుల సన్నిధులు.
మూడో ప్రాకారంలో కొలువుతీరిన శ్రీ పేరుందేవి అమ్మవారిని దర్శించిన తరువాతే శ్రీ వరదరాజ పెరుమాళ్ దర్శనానికి వెళ్ళాలి.
పదమ దిశగా ఉండే ప్రధాన ఆలయంలో మూలవిరాట్టు స్థానిక భంగిమలో దివ్యమైన అలంకరణలో నేత్రపర్వంగా దర్శనమిస్తారు.
ముఖమండపంలో విజయనగర రాజుల కాలంలో సహజ వర్ణాలతో చిత్రించిన వివిధ దేవతా రూపాల చిత్రాలు నేటికీ చెక్కుచెదరక పోవడం చెప్పుకోదగిన సంగతి.


స్వామి వారి దర్శనానంతరం వెలుపలకు వచ్చేటప్పుడు పైకప్పుకు ఒక రాతి దూలం పైన చెక్కిన బంగారు బల్లి మరియు వెండిబల్లిని తాకాలి.
దీనికి సంబంధించిన పురాణగాథ ఏమిటంటే గౌతమ మహర్షి వద్ద ఇద్దరు శిష్యులు  ఉండేవారు.  వారు గురువు గారి దేవతార్చనకు కావలసిన పుష్పనాలు, ఫలాలు మరియు నీరు ఏర్పాటు చేస్తుండే వారు. ఒకనాడు వారు పెట్టిన నీటి పాత్రలో ఒక బల్లి పడింది. ఆగ్రహించిన మహర్షి వారిని బల్లులుగా జీవించమని శపించారు. తెలియకచేసిన తప్పుకు క్షమించమని వేడుకొనగా ఆయన వారిని అత్తిగిరి క్షేత్రం వెళ్లి స్వామిని సేవించమని శాప విమోచన తెలిపారు.
కొంతకాలానికి ఇంద్రుడు సూర్యుడు మరియు చంద్రునితో కలిసి శ్రీ వరదరాజ పెరుమాళ్ దర్శనానికి తరలి వచ్చాడు. వారి దర్శనంతో శిష్యులకు శాపవిమోచనం లభించినది.
నాటి నుండి ఇక్కడ వారి రూపాలను ఏర్పరచారు. వీటిని తాకిన వారి సమస్త దోషాలు, పాపాలు తొలగిపోయి ఆరోగ్యవంతులు అవుతారని చెబుతారు.ఈ ఆలయంలో ఉన్న మరో విశేషము ఏమిటంటే గర్భాలయం లో ఒకప్పుడు అత్తి చెట్టు కాండంతో చేసిన విగ్రహం ఉండేది. చెక్క విగ్రహం. దీనిని బ్రహ్మదేవుని ప్రతిష్టగా భావిస్తారు. నిత్యపూజల కారణంగా విగ్రహా రూపం మారుతున్నందున దాని స్థానంలో రాతి విగ్రహాన్ని ప్రతిష్టించారు. పాత విగ్రహాన్ని అనంత పుష్కరణిలో వెండి భోషాణంలో ఉంచి నలభై సంవత్సరాల కొకసారి వెలుపలకు తీసి పది రోజుల పాటు భక్తుల దర్శనార్ధం ఉంచుతారు. అనంతరం తిరిగి పుష్కరణిలో ఉంచుతారు. చివరిసారి ఈ ఉత్సవం జరిగింది 1979 వ సంత్సరం జులై నెలలో జరిగింది.  తిరిగి 2019 వ సంవత్సరం జులై నెలలో అత్తివరద స్వామి దర్శనం మనకు లభిస్తుంది. సంవత్సరమంతా ఎన్నో ఉత్సవాలతో, ప్రతి నిత్య ఎన్నో పూజలతో సేవలతో భక్తులతో కళకళ లాడుతుంటుంది శ్రీ వరద రాజ పెరుమాళ్ కోవెల.


పన్నెండు మంది శ్రీ వైష్ణవ ఆళ్వార్లలో పై ఆళ్వార్, తిరుమంగై ఆళ్వార్ మరియు భూతత్తి ఆళ్వార్ తమ పాశురాలలో శ్రీ వరదరాజ స్వామిని కీర్తించారు.

 కాంచీపురం మనరాష్ట్రం లోని తిరుపతి, చిత్తూరు పట్టణాల నుండి సులభంగా రహదారి మార్గంలో చేరుకోవచ్చును. అల\అదే విధంగా చెన్నై నుండి, చెంగల్ పట్టు నుండి ప్రతి పది నిముషాలకి ఒక బస్సు లభిస్తుంది.
ఓం నమో నారాయణాయ నమః !!!!

Monday, February 27, 2017

Sri Kailasanadar Temple, Kanchipuram

                           శ్రీ కైలాస నాథర్ ఆలయం , కాంచీపురం 

సప్త ముక్తి క్షేత్రాలలో ఒకటిగా పౌరాణిక ప్రసిద్ధి చెంది, మహత్తర చరిత్రకు మరోపేరుగా గుర్తింపబడిన ఊరు కాంచీపురం. 
ఆలయాల నగరంగా ప్రత్యేక గౌరవాన్ని అందుకొన్న ఈ ఊరిలో రెండు భాగాలు కలవు. 
విష్ణు మరియు శివ కంచి. 
శివ కంచిలో ముఖ్య ఆలయం శ్రీ ఏకాంబరేశ్వర స్వామిది. 
విష్ణు కంచిలో ప్రధాన కోవిల శ్రీ వరద రాజ పెరుమాళ్ ది. 
చిత్రమైన విషయం ఏమిటంటే విష్ణుకంచిలో శివాలయాలు, విష్ణు కంచిలో శివుని కోవెలలు ఉండటం !
ఒకప్పుడు ఇక్కడ వెయ్యికి పైగా ఆలయాలు ఉండేవని చెబుతారు. చాలా వరకు పల్లవ రాజుల కాలంలో నిర్మించినవే! ( క్రీస్తు శకం 3 నుండి 9వ శతాబ్ద మధ్య కాలం)
పురాణ, చారిత్రక, నిర్మాణ విశేషాలతో వేటికవే అపూర్వంగా దర్శనమిస్తాయి. 
అలాంటి వాటిల్లో శివ కంచిలోని పురాతన ఆలయమే శ్రీ కైలాస నాథర్ గురించిన విశేషాలు తెలుపుతున్నాను. 


సుమారు ఏడో శతాబ్ద కాలంలో పల్లవ రాజు రాజసింహ (రెండో నరసింహ వర్మ)ఆధ్వర్యంలో నిర్మించబడిన ఈ ఆలయం ఎన్నో అపురూప శిల్పాలకు పెట్టింది పేరు.
వేదావతి నదీ తీరంలో కంచి పట్టణానికి పడమర దిక్కున బస్సు స్టాండు కు అయిదు కిలోమీటర్ల దూరంలో ఉండే ఈ ఆలయం  ప్రస్తుతం పురావస్తు శాఖ వారి ఆధ్వర్యంలో ఉన్నది.
ఆరు వందల పరిపాలనా కాలంలో ఎందరో పల్లవ రాజులు నిర్మింప చేసిన అనేకానేక ఆలయాల్లో ప్రస్తుతం నిలిచి ఉన్న కొద్దీ పురాతన ఆలయాల్లో ఇదొకటి.


 చారిత్రక ప్రసిద్ధిని పొందిన ఈ ఆలయ నిర్మాణానికి సంబంధించిన పురాణ గాధ గురించి తెలియకున్నా నిర్మాణ విశేషాలు మాత్రం తరగనివే !
మిగిలిన ఆలయాల మాదిరి కొండరాతి తో కాకుండా ఇసుక రాతి మీద నాటి శిల్పులు తమ నైపుణ్యాన్ని ప్రదర్శించిన తీరు అద్భుతం. మరో విశేషమేమిటంటే రాతి మీద నిర్మింపబడిన తొలి పల్లవ ఆలయంగా చరిత్ర కారులు పేర్కొనడం!
అంతకు ముందు పల్లవులు నిర్మించినవి చాలా వరకు గుహాలయాలే!!
సువిశాల ప్రాంగణంలో తూర్పు దిశన ఉండే ఈ ఆలయ ప్రాంగణం లోనికి దక్షిణ దిశగా ప్రవేశ ద్వారం ఉంటుంది.
ప్రధాన ఆలయానికి ఎదురుగా తూర్పున పెద్ద నంది విగ్రహం కనిపిస్తుంది.


సంపూర్తిగా పల్లవ నిర్మాణ శైలిని ప్రదర్శించే ఈ ఆలయం వెలుపలి ప్రకారం, ప్రదక్షిణ ప్రాంగణం  మరియు గర్భాలయం అనే మూడు భాగాలుగా ఉంటుంది. గర్భాలయాన్ని ముఖమండపాన్ని కలుపుతూ ఒక అర్ధమండపం ఉంటుంది. అవ్వడానికి విశాల ప్రాంగణం అయినా  ప్రధాన ఆలయం చిన్న రాతిని కూడా వదల కుండా చెక్కిన శిల్పాలతో కిక్కిరిసి పోయినట్లుగా కనపడుతుంది.
ప్రాకారానికి  లోపలి వైపున ఎన్నో శివ రూపాలను చెక్కారు. ధ్యాన, నర్తన, అసుర సంహార,త్రిపురాంతక, రుద్ర, గంగాధర, లింగోద్భవ, భిక్షందార్, అర్ధనారీశ్వర  ఇలా ఎన్నో !
అదే విధిగా శ్రీ గణపతి, శ్రీ కార్తికేయ, శ్రీ దుర్గ, శ్రీ విష్ణు రూపాలు కూడా కనపడతాయి.గర్భాలయ వెలుపల చెక్కిన నిలువెత్తు సింహ (?) రూపాలు అబ్బుర పరుస్తాయి. ఇక్కడే చిన్న చిన్న ఉపాలయాలను నిర్మించారు. వీటిల్లో ఉమామహేశ్వర, లింగోద్భవ, శ్రీ దేవి భూదేవి సమేత శ్రీ మన్నారాయణ,  బ్రహ్మ,  శ్రీ దుర్గ, శ్రీ దక్షిణా మూర్తి,  ఆదిగా గల దేవీశ్రీ నారసింహ   దేవతలు కొలువుతీరి ఉంటారు. గోడల పైన చెక్కిన  శివ పురాణ ఘట్టాలు, భూతగణాల శిలాపాలు చూపరుల దృష్టిని ఆకట్టుకొంటాయి.
అన్ని దిక్కులా చెక్కిన శివ తాండవ శిల్పాలు అద్భుతక్మ్. ఇవి మొత్తం నూట ఏమిది అని చెబుతారు.
అన్నింటి లోనికి కొన్ని శిల్పాలను అపురూపమైనవిగా పేర్కొనాలి. వీణ ధరించిన పరమేశ్వరుడు. నటరాజ నాట్య విన్యాసాన్ని తిలకిస్తున్న గణాలు, శ్రీహరి, విధాత ఇతర దేవతలు, సోమస్కంద మూర్తి, శ్రీ ఉమామహేశ్వరుడు ముఖ్యమైనవి.
అన్నింటినీ వీక్షిస్తూ ప్రదక్షిణ పూర్తి చేసుకొని గర్భాలయానికి చేరుకోడానికి సన్నని మార్గం గుండా వెళ్ళాలి. దర్శనానంతరం మరో సన్నని మార్గం గుండా వెలుపలికి రావాలి. వీటిని జీవి పుట్టుక మరణానికి నిదర్శనాలుగా పేర్కొంటారు.
గర్భాలయంలో ఎత్తైన పదహారు ముఖాలు గల లింగ రూపంలో శ్రీ కైలాస నాథర్ దర్శనమిస్తారు. ఎదురుగా నంది.
నేటికీ నిత్య పూజలు జరగడం ఒక ప్రత్యేకతగా చెప్పుకోవాలి.
మండపం లోను, మండప స్తంభాల  పైన ఎన్నో శాసనాలు కనపడతాయి. వీటిల్లో చాలావరకు పల్లవ రాజులు శ్రీ కైలాస నాథర్ స్వామికి సమర్పించు కొన్న కానుకల వివరాలు మరియు వారి శివభక్తి తెలిపేవే !
ఉదయం తొమ్మిది గంటల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు తెరిచి ఉండే ఈ ఆలయ సందర్శనతో మాత్రమే ఒకరి కంచి యాత్ర సంపూర్ణం అవుతుంది అంటే ఎలాంటి అతిశయోక్తి లేదు.
అంతటి విశిష్ట ఆలయం శ్రీ కైలాస నాథర్ స్వామిది !!


కాంచీపురానికి చెన్నై నుండి సులభంగా రహదారి మార్గంలో చేరుకోవచ్చును. ఈ ఆలయం చేరుకోడానికి బస్సు స్టాండ్ నుండి ఆటో లు దొరుకుతాయి. చక్కని భోజన మరియు వసతి సౌకర్యాలు అందుబాటు ధరలలో లభిస్తాయి. 

నమః శివాయ !!!!